Monsoon Rains in Andhra Pradesh: జూన్ 5లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాయని ఐఎండీ తెలిపింది. ప్రీ మాన్‌సూన్ వల్ల మరో 2, 3 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు సెగలు కక్కుతున్నాయి. వాయువ్య ప్రాంతాల నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావం నేరుగా రాష్ట్రంపై పడటంతో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. పగటి, రాత్రి పూట ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. తేమలేని పొడిగాలుల కారణంగా ఎండ తీవ్రత బాగా పెరిగింది.
మరో గుడ్న్యూస్- అనుకున్న డేట్ కన్నా ముందే వర్షాలు! - South West Monsoon IMD
అన్నిచోట్లా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటి నమోదు అవుతున్నాయి. అత్యధికంగా వినుకొండలో 46 డిగ్రీలు నమోదుకాగా ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో 45.4 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 45.3 డిగ్రీలు, గుంటూరు జిల్లా తుళ్లూరు, ఫిరంగపురంలో 45 డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 69 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం కోస్తాంధ్రలోని 58కి పైగా మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశమున్నట్లు వెల్లడించింది. అలానే మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
South West Monsoon 2024 : నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాల్లోకి అనుకున్న తేదీ కన్నా ముందే ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ- ఐఎండీ అంచనా వేసింది. ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అసోం, బంగాల్, సిక్కింలోకి ప్రవేశించాయని తెలిపింది. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయని వెల్లడించింది.
150 ఏళ్లుగా!
ఐఎండీ లెక్కల ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి 1918లో మే 11న ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్ 18న ప్రవేశించాయి. గతేడాది జూన్8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకాయి. ఈసారి మే 31న రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. కానీ అంచనాల కన్నా ఒకరోజు ముందే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడం విశేషం.
కేరళలో జోరుగా వర్షాలు
మరోవైపు, రుతుపవనాల ప్రభావంతో కేరళలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో ఇవి తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం వంటి కారణాలతో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.