Monsoon Rains IN Andhra Pradesh: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ సహా కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల అక్కడకక్కడ పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఉప్పుటేరుకు ఊరటేది- వైఎస్సార్సీపీ నిర్లక్ష్యానికి మత్స్యకారుల అవస్థలు! - Donkuru Bridge Damaged
ఈ నెల 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా బలపడి మే 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఛత్తీస్గడ్ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక సమీపంలోని కామోరిన్ ప్రాంతం వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్టు వాతావరణ విభాగం తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్నట్టు వెల్లడించింది. రాయలసీమ మీదుగా తమిళనాడులోని ఉత్తర ప్రాంతాల వరకూ విస్తరించిన మరొక ఉపరితల ఆవర్తనం ఉన్నట్టు స్పష్టం చేసింది.
ఈ రెండిటి ప్రభావంతో ఈ నెల 23 తేదీ వరకూ ఏపీ, తెలంగాణ సహా కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఇవి మరింతగా పురోగమించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఆదివారం నాటికి ఇవి అండమాన్ నికోబార్ ప్రాంతాలతో సహా బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై విస్తరించే అవకాశముందని తెలిపింది.
ఏపీలో వర్షం : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిస్తుంది. వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు పలు ప్రాంతాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డుతున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోకుండా కాపాడుకుంటున్నారు. కల్లాల్లో తడిసిపోతుందని ధాన్యాన్ని మరికొందరు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు భారీ వర్షానికి పలు రోడ్లు జలమయ్యాయి.