Minister Payyavula Keshav Reacts Jagan Letter about Opposition Status : వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నేత కాదని ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్‌కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. స్పీకర్‌కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేవలం మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాకుండా శాసనసభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్ అండ్ షఖ్దర్ పుస్తకం, అసెంబ్లీ రూల్ బుక్ చదవాలని సూచించారు. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచనల మేరకే రాశారా అని ఆయన ఎద్దేవా చేశారు.
Former MLC Ramachandraiah: 11 సీట్లు మాత్రమే పొందిన జగన్‌కి ప్రధాన ప్రతిపక్షహోదా కావాలట అని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఎద్దేవా చేసారు. ఆ హెూదా ఉంటేనే ప్రజాసమస్యల్ని సమర్థవంతంగా సభలో విన్పించగలరట అని ఆయన జగన్‌కు చురకలు వేశారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి రాసిన లేఖలో జగన్ ఓ వింత వాదన, అసంబద్ధమైన వాదన చేసారని మండిపడ్డారు. మీరు బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకం అయినపుడు తటస్థంగా ఎందుకు ఉండటం లేదో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. పార్టీని ప్రైవేటు లిమిటెడ్‌గా నటపడం వల్లనే ఓటమి ఎదురయిందని గుర్తించకుండా ఇంకా ఆ పద్ధతిలోనే ముందుకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిని అజ్ఞానం అనాలా దురంహకారం అనాలా చెప్పండి జగన్ రెడ్డి అని నిలదీశారు.
MLA Madhavi Reddy: ప్రతిపక్ష హోదా కోసం జగన్ రెడ్డి స్పీకర్‌కు లెటర్ రాయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదాను కోరడం హేయమన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి మొఖం చూపించలేక కుయుక్తులకు తెరలేపారని విమర్శించారు. ఇన్ని రోజులు రాజారెడ్డి రాజ్యాంగం నడిపిన జగన్ రెడ్డికి భారత రాజ్యాంగం మార్చి కొత్త రాజ్యంగం రాస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.
TDP National Spokesperson GV Reddy: ప్రత్యేక హోదా కోసం పోరాడతానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి చివరికి ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి ఎద్దేవా చేసారు. ఇది తన ఉనికి కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు.