Minister Narayana on Operation Budameru : ఆక్రమణల తొలగింపునకు త్వరలోనే 'బుడమేరు ఆపరేషన్' చేపడతామని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నవారికి ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇందు కోసం ఇప్పటికే ఉన్న నిబంధనలు సరిపోకపోతే అవసరమైతే కొత్త చట్టం తెస్తామని నారాయణ తేల్చి చెప్పారు.
26 డివిజన్లు పూర్తిగా ముంపు నుంచి కోలుకున్నాయని, రేపు ఉదయానికల్లా మిగిలిన ప్రాంతాల్లోనూ వరద నీరు లేకుండా చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. ఇంటింటి నష్టం అంచనా ప్రక్రియ అవసరమైతే ఇంకో రోజూ పొడిగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా ఇంట్లో లేకపోయినా, వేరే ప్రాంతానికి వెళ్లినా వారు వచ్చాక కూడా నష్టం అంచనా నమోదు చేస్తామని భరోసానిచ్చారు. 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పగలు, రాత్రి కష్టపడి పని చేస్తున్నారని నారాయణ తెలిపారు. బుడమేరుకు గండిపడి వచ్చిన నీటికి పోయే దారి లేక ఇబ్బందులు తలెత్తాయని వాపోయారు. రేపు, ఎల్లుండి కూడా అవసరమైన చోట ఆహారం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
నష్టంపై నివేదిక సిద్ధం కాగానే పరిహారం : వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. కుందా వారి కండ్రిక, నున్న - నూజివీడు రోడ్డులో ఇప్పటికీ వరద నీరు కొనసాగుతుంది. నున్న రోడ్డుకు ఇరువైపులా ఇళ్ల మధ్య నిలిచిన నీటిని బయటకు పంపించేందుకు భారీ మోటార్లు ఏర్పాటు చేసిన సిబ్బంది రోడ్లకు గండ్లు కొట్టారు. ప్రొక్లేయిన్లు, భారీ యంత్రాలతో వరద నీటి తరలింపు కోసం జరుగుతున్న పనులను మంత్రి దగ్గరుండి పర్యవేక్షించారు.
ప్రతి రోజూ మూడు సార్లు క్షేత్ర పర్యటనల ద్వారా మంత్రి సహాయక చర్యల్లో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. కండ్రిక చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నీరు నిల్వ ఉందని ఈ సాయంత్రంలోగా నీటిని పూర్తిగా బయటకు తరలించేలా భారీ ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు. రాత్రి నుంచి తనతో పాటు అధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారన్నారు. నీరు పూర్తిగా తగ్గుతుందని వరద నీరు తగ్గగానే పారిశుద్ధ్య పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే వరద నష్టం అంచనాల ప్రక్రియ కూడా జరుగుతుందని, నష్టంపై నివేదిక సిద్ధం కాగానే ఎవరెవరికి ఎంత పరిహారం ఇవ్వాలనేది సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇప్పటివరకూ లక్షా 75 వేల మందికి నిత్యావసర సరుకులు అందించామని, బాధితులందరికి నిత్యావసరాలు అందిస్తామని స్పష్టం చేశారు.
"శభాష్ రామానాయుడు"- వరద నియంత్రణ చర్యలపై చంద్రబాబు ప్రత్యేక అభినందనలు - CBN CONGRATULATED NIMMALA