Minister Nadendla Manohar Released Grain Dues : వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకంతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనకబడిందని, రూ.12 లక్షల కోట్ల అప్పులు చేశారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గత ప్రభుత్వం రైతులకు రూ.1,674 కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందని తెలిపారు. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన ధాన్యం బకాయిల్లో రెండో విడతగా రూ.674 కోట్లను మంత్రి రైతులకు అందించారు. నిధుల చెక్కులను రైతులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునే బాధ్యత తమదని, వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. త్వరలోనే గ్రామ సభలు ఏర్పాటు చేసి కౌలు కార్డులు ఇస్తామని అన్నారు.
మాటతప్పిన జగన్ - ధాన్యం బకాయిల కోసం అన్నదాతల ఎదురుచూపు - Delay Grain Arrears in YSRCP Govt
ప్రతీ గింజ కొంటాం - 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు : గత ప్రభుత్వం రైతులకు రూ.1,674 కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందన్న నాదెండ్ల మనోహర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిపారు. కష్టకాలంలో ఉన్నా గత నెలలో రూ.వెయ్యి కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం మిగిలిన రూ.674 కోట్లు అందజేస్తున్నట్లు చెప్పారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35,374 మంది రైతుల ఖాతాల్లో రూ.472 కోట్లు వేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు గోతాలు కూడా అందజేయలేదని విమర్శించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పారు. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏ మాత్రం వెనకాడబోమని చివరి గింజ వరకూ కొంటామని స్పష్టం చేశారు.
ఈ-క్రాప్ నమోదు చేయించుకోండి : ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు కష్టపడి ధాన్యం పండిస్తారని, కానీ గత ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేసిందని నాదెండ్ల అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నష్టం జరిగిందని ఆరోపించారు. రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో తాము కళ్లారా చూశామని, చివరికి రైతుల నుంచే డబ్బులు తీసుకోవడం చూశామని అన్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో రైతులకు కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేదని తెలిపారు. సివిల్ సప్లయిస్ శాఖ తరఫున 50 శాతం రాయితీతో టార్పాలిన్ల పంపిణీ చేస్తామని, అలాగే దగ్గర్లోని మిల్లుకే ధాన్యం తరలించేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులు సహాయ కేంద్రాలకు వెళ్లి ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని సూచించారు. రైతు సహాయ కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉంచామని, వ్యాపారులు, మిల్లర్లు, దళారీలకు రైతులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
భరోసా ఇవ్వలేకపోతున్న రైతు భరోసా కేంద్రాలు - ధాన్యం డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు