Roads Flooded Due to Heavy Rains in Nidadavolu: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జలమయమైంది. ప్రధాన రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై అడుగుపైగా నీరు ప్రవహిస్తుండంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొద్దిపాటి వర్షానికే నీట మునిగే ఆర్టీసీ బస్టాండ్ ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా మునిగిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతం చెరువును తలపిస్తోంది.
మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి బస్సులు ఎక్కాల్సి రావడంతో ప్రయాణికులు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నిడడవోలు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే రహదారులు నీట మునుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు బస్టాండు ఆవరణం ఎన్నిసార్లు మునిగిపోయినా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు.
నిడదవోలులో పర్యటించిన మంత్రి దుర్గేష్: నిడదవోలు పట్టణంలో రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, శ్మశాన వాటిక, ప్రధాన రహదారులను ఆయన పరిశీలించారు. నీట మునిగిన ప్రాంతాల గురించి తెలుసుకుని మంత్రి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. బస్టాండ్‌లోని నీటిని మోటార్లతో తోడించాలని అధికారులకు మంత్రి సూచించారు.
బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిపై రుడా అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే ఈ ముంపు సంభవించినట్లు మంత్రి గుర్తించారు. ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న మురుగు కాలువలోని స్కిల్ట్ తీయకపోవడంతో నీరు బయటకుపోయే మార్గం లేకపోవడం వల్ల బస్టాండ్ మునిగిపోతుందని మంత్రి చెప్పారు. నిడదవోలు పట్టణంలో మురుగు కాలువలు, ఇతర సమస్యల పరిష్కారానికి మూడు కోట్ల రూపాయలతో ప్రతిపాదన చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
బస్టాండ్ నుంచి నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేదు. ప్రయాణికులు బస్సులు ఎక్కాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. బస్టాండ్ ఆవరణలో ఉన్న నీటిని మొత్తంగా బయటకు వెళ్లే విధంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. ఇప్పుడు చెయ్యాలంటే అది అంతా పూర్తి కాదు. కావున నీటిని మోటర్ల సాయంతో బయటకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులకు చెప్పాను. ఈ విషయంపై రుడా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. -కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
అల్పపీడన ద్రోణి ప్రభావం - కురుస్తున్న వర్షాలు - Heavy Rains in Andhra Pradesh