Variety Marriage Rituals in Sanampudi : వివాహాల్లో వధూవరులకు ప్రత్యేకంగా అలంకరణ ఉంటుంది. అది ఆయా ప్రాంతాలు ఆచార వ్యవహారాలపై ఆధారపడి ఉంటుంది. అందులోనూ పలు ప్రత్యేకతలు కనిపిస్తాయి. కానీ అబ్బాయి అమ్మాయిగా, అమ్మాయి అబ్బాయిగా మారడం ఎక్కడైనా విన్నారా? ఇది వినగానే టక్కున గుర్తొచ్చేది జంబలకిడిపంబ సినిమానే. ఇటువంటిదే ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం శానంపూడిలోనూ కొనసాగుతోంది. పెళ్లి కుదిరితే చాలు ఇక్కడ ఒకరోజంతా జంబలకిడిపంబగా మారాల్సిందే.
శానంపూడి పంచాయతీ పరిధిలోని పటికనేనివారిపాలెంలో కోడిపల్లి అనే ఇంటి పేరు కలిగిన కుటుంబాలు సుమారు 100 వరకు ఉంటాయి. ప్రధానంగా వ్యవసాయం వృత్తిగా పాడిని అనుబంధంగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నాగార్పమ్మను తమ దైవంగా పూజిస్తుంటారు. ఈ కుటుంబాల్లోని ఎవరైనా యువకుడికి వివాహం నిశ్చయమైతే అతడికి చీర కట్టి అమ్మాయిలా, యువతికి పంచె కట్టి, చొక్కా ధరింపజేసి యువకుడిగా అలంకరిస్తారు.
Men Turn Into Girls in Marriage Rituals : ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో గంధం ఉంచుతారు. అనంతరం బోనం ఎత్తుకుని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గ్రామ శివారులోని వీరుల జమ్మి చెట్టు వద్దకు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. ఇక్కడ ఇంకో విశేషమేమంటే ఈ క్రతువు పూర్తయ్యే వరకు సదరు యువతీ, యువకులు ఇతరులు ఎవరితోనూ మాట్లాడకూడదు. వంశాభివృద్ధి కోసం పూర్వీకులు ఈ ఆచారాన్ని పాటించేవారని వారు చెబుతున్నారు. ఇప్పటికీ అదే విధానాన్ని తాము కొనసాగిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.
రతి మన్మథుడి అనుగ్రహం కోసం ఆ ఊరి యువకులు ఏం చేస్తారో తెలుసా? - Unique Tradition in Kurnool Dist