Mega Parent - Teacher Meet in Govt and Aided Schools: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ – టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. తల్లిదండ్రుల సహకారం, వారి భాగస్వామ్యంతో 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని విద్యా శాఖ కార్యదర్శి వివరించారు.
బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరవుతారని వెల్లడించారు. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, సంబంధిత పాఠశాలల్లో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోన శశిధర్ కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పెద్ద ఎత్తున మెరుగు పర్చాలనే లక్ష్యంతో ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.
0-5 స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతి పాఠశాలలో అమలు పరుస్తామని శశిధర్ వివరించారు. ప్రతి పాఠశాలకు తొలుత ప్రకటించిన స్టార్ రేటింగ్ క్రమంగా ఏడాదికి ఏడాది వృద్ధి అయ్యేలా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు - విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ గరిష్టంగా 5 స్టార్ రేటింగ్లోకి అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీసుకువెళ్లేందుకు చర్యలు చేపడతామని శాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు.
తిరుమల భక్తులకు గుడ్న్యూస్ - కావాల్సినన్ని లడ్డూలు - ఎప్పటినుంచో తెలుసా?