Medicines Delivering with Drones : పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో లభించే అన్ని మందులు చిన్న చిన్న పట్టణాల్లో లభ్యం కావు. ఒకవేళ దొరికినా వాటిని నిల్వ చేసుకోలేము. ఎందుకంటే వాటికి కూడా కొంత సమయం ఉంటుంది. ఆ సమయం దాటితే అది పనికిరాదు. అలాగని అవసరమైనప్పుడే తీసుకురావాలంటే సమయాభావం తప్పదు. ఫలితంగా రోగి ప్రాణానికే ముప్పు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే వీలైనంత త్వరగా వాటిని తీసుకురావడమే ఉత్తమం. లేకపోతే రోగినే పెద్ద నగరాల్లోని ఆసుపత్రులకు తీసుకెళ్లాలి. ఇది అన్నివేళల్లో సాధ్యపడదు. ఒకానొక సమయంలో ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి చెక్పట్టాలని భావించిన ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది.
10 నిమిషాల్లోనే డెలివరీ : విపత్తులు, అత్యవసర సమయాల్లో మారుమూల ప్రాంతాలకు మందుల సరఫరా చేయడంలో డ్రోన్ల వినియోగానికి అడుగులు పడుతున్నాయి. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో పైలట్ ప్రాజెక్టు (Pilot Project)గా చేపట్టిన ప్రక్రియ విజయవంతమైంది. మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి 15 కి.మీ. దూరంలోని అన్నవరపులంక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి డ్రోగో డ్రోన్ ద్వారా 10 కిలోల టీకాలు, మందుల కిట్‌ను పంపించారు. రహదారులు, రేపల్లె కాలువ, కృష్ణా నది పరివాహక ప్రాంతాలను దాటి 10 నిమిషాల్లోనే డ్రోన్ లక్ష్యాన్ని చేరుకుంది. పీహెచ్‌సీ వైద్యాధికారిణి సీహెచ్ లక్ష్మీ సుధ, తహసీల్దార్ సిద్ధార్థ, ఎంపీడీవో విజయ లక్ష్మి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు పేర్కొన్నారు.
వరద బాధితులకు పటిష్ట సహాయ చర్యలు - డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ - first time used drones in ap
విజయవాడ వరదల్లో ఆహార పంపిణీకి డ్రోన్లు వినియోగం : ఇటీవల విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మరో అడుగు ముందకు వేసి వరద లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి మెుదటిసారిగా డ్రోన్ల ద్వారా నీరు, ఆహారం, మెడిసిన్‌ను పంపిణీ చేసింది.
బోట్లు, హెలికాప్టర్లు సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా ఈ డ్రోన్లను వినియోగించింది. పలు ప్రాంతంలో బాధితులకు డ్రోన్ ద్వారా ఆహార పంపిణీ సత్ఫలితాలను ఇచ్చింది. దీనిపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం పంపిణీకి డ్రోన్లు వాడుతున్నామన్నారు. డ్రోన్ల ద్వారా సహాయ చర్యలను వేగవంతం చేశామని తెలిపారు. వరద బాధితులకు సాయం చేసేందుకు డ్రోన్లు వాడటం ఇదే తొలిసారి అని లోకేశ్ వెల్లడించారు.