Anakapalli Jaggery Products : వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అన్నదాతలను పారిశ్రామికవేత్తలుగా తయారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ మేరకు ఆహార శుద్ధి విధానం 2024-2029 ప్రభుత్వం విడుదల చేసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు పెట్టే ప్రతి రూ.లక్ష పెట్టుబడికి రూ.75,000 వివిధ రూపాల్లో తోడ్పాటు అందివ్వాలని నిర్ణయించింది.
అనకాపల్లి జిల్లాలో చెరకు సాగు అధికం. గతంలో నాలుగు చక్కెర ఫ్యాక్టరీలు ఉండేవి. ఇప్పుడు ఒక్కటే నడుస్తుంది. దీంతో చెరకు నుంచి ఎక్కువ మంది అన్నదాతలు బెల్లం తయారీకే ఆసక్తి చూపుతున్నారు. బెల్లం దిమ్మల రూపంలో కాకుండా ముక్కలు, పొడి, తేనె రూపంలో తయారీ చేస్తే అధిక ఆదాయం వస్తుందని ఇప్పటికే అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరూపించారు. బెల్లం ఉప ఉత్పత్తులు తయారీ యూనిట్ ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలకు అవసరమైన సాంకేతిక సలహాలు, శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటికే కె.కోటపాడు, అనకాపల్లి మండలం కూండ్రం, మాకవరపాలెం మండలం రాజుపాలెంలోని యువ రైతులు శాస్త్రవేత్తల సూచనల మేరకు ఉప ఉత్పత్తులు తయారుచేస్తున్నారు.
వ్యవసాయంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రంగంలో ఆదాయ వనరులు పెంచుకోవడంపై అవగాహన కల్పించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా మహిళా రైతులకు వ్యవసాయంలో ఆధునిక విధానాలు నేర్పడమే కాకుండా ఎక్కువ లాభాలు ఆర్జించేలా ఉప ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు ఎస్సీ రైతులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేవారు. ఇప్పుడు ఆసక్తి ఉన్న మహిళా రైతులకు అవకాశం కల్పిస్తున్నారు.
ఉప ఉత్పత్తుల తయారీపై : గ్రామీణ స్థాయిలోనే వ్యవసాయ ఉప ఉత్పత్తులు తయారీ చేసి విక్రయిస్తే లాభాలు వస్తాయని ఆర్థిక శాస్త్రవేత్తలు తరచూ చెబుతుంటారు. బెల్లం ముక్కలు, పొడి, పాకంతోపాటు కేకు, కుకీస్, బిస్కెట్లు, చాక్లెట్, గవ్వలు, గొట్టాలు వంటివి తయారీ చేసి అమ్మకాలు చేయొచ్ఛు దీంతోపాటు చిరుధాన్యాలతో వివిధ చిరుతిళ్లు తయారీపై శిక్షణ ఇస్తారు. ప్యాకింగ్, మార్కెటింగ్ విధానం నేర్పిస్తారు.
ఆసక్తి ఉన్న వారికి శిక్షణ : అనకాపల్లి పరిశోధన కేంద్రంలో బెల్లం ఉప ఉత్పత్తులపై ఉచితంగా శిక్షణ ఇస్తామని అనకాపల్లి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త పి.వి.కె.జగన్నాథరావు తెలిపారు. మహిళలు బృందాలుగా వస్తే పరిశోధన కేంద్రంలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ విధానాన్ని నేర్పుతామని చెప్పారు. యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు.