Lack of Facilities in Industrial Parks: రోడ్లు ఉండవు ! ఉన్నా ఏళ్లుగా మరమ్మతులకే దిక్కు ఉండదు. నీటి వసతి అంతంతమాత్రమే. మురుగు కాల్వల ఊసే లేదు. ఇదంతా ఎక్కడో మారుమూల గ్రామాల్లో కాదు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నిర్దేశించిన పారిశ్రామిక పార్కుల్లో దుస్థితి. రాష్ట్రంలో ఏపీఐఐసీ (Andhra Pradesh Industrial Infrastructure Corporation) ఏర్పాటు చేసిన 543 పారిశ్రామిక పార్కులు దిక్కుమొక్కు లేనివిగా మారాయి.
రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో 19 వేల 456 యూనిట్ల ఏర్పాటుకు భూములు కేటాయించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రైవేటు రంగంలో లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమలను చేయి పట్టుకొని నడిపిస్తానంటూ గద్దెనెక్కి ఆ తర్వాత ఆ వైపే చూడటం లేదు. ప్రస్తుతం ఉన్న వాటిలో మౌలిక సదుపాయాలను కల్పించలేని అసమర్థ జగన్ సర్కార్ కొత్తవాటిని అభివృద్ధిని చేస్తానంటూ మాటలు కోతలు కోస్తోంది.
జగన్ సర్కార్ పాలనా వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమే విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక పార్కు. ఇక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధికి 4 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ అతీగతి లేదు. 15 ఏళ్ల కల్పించిన వసతులే ఇక్కడ దిక్కుగా మారాయి. పారిశ్రామిక వాడలో 31 కిలోమీటర్ల బీటీ రోడ్లు ఉంటే, అందులో 70 శాతం గోతులమయంగా మారాయి. ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో 40 టన్నుల లోడ్ ఉన్న లారీలు ముడిసరకుతో రాకపోకలు సాగిస్తుంటాయి.
అధ్వాన రోడ్లతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రిజర్వాయర్ నీరు పరిశ్రమల నిర్వహణకు ఏమాత్రం చాలడం లేదు. 12 కిలోమీటర్ల కాలువల్లో 40 శాతం ఆనవాళ్లు కోల్పోయాయి. మరో 10 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటుచేసిన 610 హైమాస్టు దీపాల్లో అధికశాతం పనిచేయడం లేదు. యూనిట్ల నుంచి ఆస్తి, నీటి పన్నుల రూపేణా 1.80 కోట్లు వసూలు చేస్తూ వాటినే నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నారు. అదనంగా జగన్ సర్కార్ పైసా కేటాయించడం లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఉన్న ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్కుల్లో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందు తలెత్తుతున్నాయి. ఇక్కడ గ్రానైట్ కటింగ్ పరిశ్రమ, ఐస్ ఫ్యాక్టరీ పరిశ్రమ, ఐరన్ పరిశ్రమ, ప్లాస్టిక్ పరిశ్రమ, పైపులు పరిశ్రమ, ఇంకా అనేక పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు మెటీరియల్ భారీగా పోతాయి. మాలకొండాపురంలో 55.48 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కును గత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇందులో వైసీపీ సర్కార్ రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసినా నీటి వసతి కల్పించలేదు. దీంతో భూములన్నీ వృథాగా పడి ఉన్నాయి.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం గండ్రాజుపల్లిలో చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారిని ఆనుకుని 115.82 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఉంది. చెన్నై సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు డిమాండ్ ఉంది. దాంతో ఈ సెజ్‌కు ఆనుకొనే మరో 50.45 ఎకరాలు, 76.83 ఎకరాల్లో మరో రెండు పారిశ్రామిక పార్కులను గత ప్రభుత్వమే డెవలప్ చేసింది.
జీన్స్ పరిశ్రమలపై విద్యుత్ ఛార్జీల బాదుడు - రాయితీలకూ నోచక మూతపడుతున్న పరిస్థితి
అయితే వీటిలో 2019-20, 2020-21లో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లు ఖర్చు చేసినట్లు సర్కార్ చెబుతున్నా ఇప్పటికీ సరైన రోడ్లు, డ్రెయిన్లు లేని దుస్థితి. దీంతో చాలావరకు భూములు వృథాగా పడి ఉన్నాయి. చిత్తూరు నగరంలో మూడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఆటోనగర్ పారిశ్రామికవాడలో మౌలిక సదుపాయాలు కరవయ్యాయి. వర్షం కురిసినప్పుడు రోడ్లపైనున్న గుంతల్లో నీళ్లు నిలుస్తున్నాయి. చెత్త సేకరణ సరిగ్గా జరగక పోగుపడుతోందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కుల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంఖ్యే అధికం. ఇక్కడ మౌలిక వసతుల కల్పన అనేది చాలా కీలకం. కానీ ఐదేళ్లలో ఇందుకోసం జగన్ సర్కారు ఖర్చు చేసింది రూ. 1000.13 కోట్లు మాత్రమే. ఫలితంగా చాలా చోట్ల రోడ్లు దెబ్బతిని ముడి సరకు, తయారైన ఉత్పత్తులను తీసుకెళ్లే భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రోడ్డు వేసిన తర్వాత ఏటా వార్షిక నిర్వహణకు నిధులు కేటాయించాలి. ఐదేళ్లకోసారి కొత్తగా లేయర్ వేయాలి.
చాలా పారిశ్రామిక పార్కుల్లో దశాబ్ద కాలం కిందట ఏర్పాటు చేసిన రోడ్లకు కనీస మరమ్మతులకే దిక్కులేదు. పరిశ్రమల నిర్వాహకులే కొందరు తమ సొంత ఖర్చుతో గుంతల్లో మట్టి పోయించుకుంటున్నారు. మురుగు నీటి కాల్వలు.. వీధి లైట్లు కూడా లేక కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకు రాని దుస్థితి. వసతులు కల్పించకుండానే ఒకటీ అరా పరిశ్రమల యాజమాన్యాల నుంచి పన్నులను మాత్రం ప్రభుత్వం దర్జాగా వసూలు చేస్తోంది.
ఐటీని చావుదెబ్బ కొట్టిన జగన్ సర్కార్- పెట్టుబడుల ఆకర్షణలో అట్టడుగున రాష్ట్రం
అచ్యుతాపురం సెజ్‌లో 206 పరిశ్రమలుంటే అందులో 90 శాతం ఫార్మా రంగానికి సంబంధించినవే. వాటి నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి వదలాలి. ప్రస్తుతం అక్కడ 1.2 కేఎల్‌డీ సామర్థ్యం కలిగిన సమగ్ర నీటి శుద్ధి ప్లాంటు (సీఈటీపీ) ఉంది. దాని సామర్థ్యం సరిపోకపోవడంతో సరిగా శుద్ధి చేయకుండానే వ్యర్థ జలాలను సముద్రంలోకి వదలిపెడతున్నారు. దాంతో అందులోని జీవులు మృతి చెందుతుండటంతో మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటోంది.
ప్లాంటును కనీసం 5 కేఎల్‌డీకి పెంచాలన్న ప్రతిపాదన ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొన్నిసార్లు వ్యర్థ జలాలను ట్యాంకుల్లో నింపి, పరవాడలోని రాంకీ ఫార్మాసెజ్‌కు తరలించి శుద్ధి చేస్తున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో పరిశ్రమలు ఆర్థిక భారంగా మారింది. ఈ సెజ్‌కు వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా 4 కి.మీ.ల బైపాస్ రోడ్డు నిర్మాణానికి సీఎం జగన్ మూడేళ్ల కిందట శంకుస్థాపన చేశారు.
ఇప్పటికీ భూసేకరణ కొలిక్కి రాలేదు. ఈ రోడ్డు పూర్తయితే విశాఖ, గంగవరం పోర్టు నుంచి అనుసంధానం ఏర్పడుతుంది. అచ్యుతాపురం-అనకాపల్లి మధ్య 13.8 కి.మీ.ల కనెక్టివిటీ రోడ్డు విస్తరణ పనులను ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో గత ప్రభుత్వం చేపట్టింది. వాటిని పూర్తి చేయడం కూడా జగన్‌ను చేతకాలేదు.
చిన్న పరిశ్రమలకు లేని చేయూత - ఉత్తుత్తి మాటలతోనే సరిపెట్టిన సీఎం జగన్