Polavaram Residents Problems : పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు గూడు కట్టించి ఇవ్వాలన్న సదుద్దేశంతో నాటి తెలుగుదేశం ప్రభుత్వం పునరావాస కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శరవేగంగా 90 శాతం ఇళ్ల నిర్మాణాలూ పూర్తి చేసింది. ఆపై అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో నిర్వాసితుల కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఇళ్లు నిరూపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి.
వైఎస్సార్సీపీ రాకతో మారిన ముఖ చిత్రం : రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన విలీన మండలాల్లోని ప్రజలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సొంత గూడు కట్టించి ఇవ్వాలని సంకల్పించింది. 2017లో స్థల సేకరణ చేసి పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టింది. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, జీలుగుమిల్లి, బుట్టాయగూడం, పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లో పెద్ద ఎత్తున కాలనీల నిర్మాణం చేపట్టింది. దాదాపు 90 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా చాలాచోట్ల కాలనీలకు ఓ రూపం సంతరించుకుంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పునరావాస కాలనీల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
మౌలిక వసతుల లేమి : పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి నిర్వాసితులకు ఇంటి సౌకర్యం కల్పించాల్సిన గత ప్రభుత్వం ఆ బాధ్యతను గాలికొదిలేసింది. గతంలో కాలనీల నిర్మాణం చేసిన గుత్తేదారుకు రూ.216 కోట్ల బకాయిలు నిలిపివేసింది. గుత్తేదారు పనులు పూర్తి చేసేందుకు ముందుకు రాలేదు. అప్పటి నుంచి కాలనీల్లో మౌలిక సదుపాయల కల్పన అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పటికీ చాలా కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి లైట్లు, పాఠశాల, ఆస్పత్రి వంటి సదుపాయాలను జగన్ ప్రభుత్వం కల్పించలేదు. కుక్కునూరు మండలంలోని దాచారం, కివ్వాక సహా పలు కాలనీల్లోని ఇళ్లను తాత్కాలిక పునరావాస కేంద్రాలుగా మార్చి గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారీ వారిని ఆ ఇళ్లలో దలదాచుకునేలా చేసింది. ఫలితంగా పునరావాస కాలనీల అసలు ఉద్దేశం మరుగున పడింది.
బీటలు వారి శిథిలావస్థకు : గత ఐదేళ్లుగా ఆయా ఇళ్లకు కనీసం మరమ్మతులు చేయకపోవడంతో అవన్నీ ప్రస్తుతం బీటలు వారి శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తైనా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటికి కనీసం ఐదేళ్లలో తలుపులు, కిటికీలు కూడా ఏర్పాటు చేయలేదు. విద్యుత్ సదుపాయం ఉన్నా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు. రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షం వస్తే చాలు కాలనీలు బురదమయంగా మారుతున్నాయి.
ఆశలన్నీ కూటమి ప్రభుత్వంపైనే : తాగునీటి ట్యాంకు నిర్మాణం పూర్తైనా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు. గోదావరి వరదలతో ఏటా నరకం చూస్తున్నామని తమకు ప్యాకేజీ నిధులు అందించి పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్వాసితులు ప్రాధేయపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని నిర్వాసితులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి తమ గోడును ప్రభుత్వానికి వినిపించాలని కోరుతున్నారు.
పోలవరంపై కేబినెట్లో చర్చ- నిధులన్నీ కేంద్రమే ఇవ్వాలని తీర్మానం - Polavaram Project Funds