Janasena Chief Pawan Kalyan Speech in NDA Meeting: ప్రధాని మోదీ నాయకత్వానికి జనసేన పార్టీ మద్దతిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో పవన్ మాట్లాడుతూ జనసేన తరఫున మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షల తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికీ భారత్ తలొగ్గదని, ఆయన నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు.
పవన్‌పై మోదీ పశంసలు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుపాను అని ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను ప్రధాని కొనియాడారు. ఈ రోజు పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరిగింది. కూటమి లోక్‌సభా పక్షనేతగా మోదీ పేరును బీజేపీ నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు.
భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన ఆ సమావేశంలోనే ఉన్న పవన్‌ను అభినందించారు. సిక్కింలో ఎన్టీఏ క్లీన్‌స్వీప్ చేసిందని అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ భారీ విజయం సాధించామని అన్నారు.
ప్రధానిగా ఎన్నుకునేందుకు సమావేశం: ప్రధాని నరేంద్రమోదీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకునేందుకు ఆ కూటమి తరఫున గెలిచిన ఎంపీలంతా పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎన్డీఏ కీలక నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు ఎన్డీయే ఇతర ముఖ్య నేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు బీజేపీ పదాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మోదీ నాయకత్వానికి ఆమోదముద్ర- ఆ విషయంలో చాలా కష్టపడ్డారన్న చంద్రబాబు! - NDA MPs Meet In Parliament