Jagan Cheated Agrigold Victims in AP : కిందపడిన వాళ్లకు చేయందించి పైకి తెచ్చేందుకు పాలకులు ప్రయత్నిస్తారు! మోసపోయిన వాళ్లకు సాంత్వన చేకూరుస్తారు. జగన్ అలా కాదు అగ్రిగోల్డ్ చేతిలో మోసపోయిన లక్షల మంది బాధితులను జగన్ కూడా వంచించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి పూవుల్లో పెట్టి పరిహారం ఇస్తానని పెద్దపెద్ద మాటలు చెప్పి బాధితుల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారు. ప్రతిపక్షంలో ఉండగా బాధితుల వద్దకు వెళ్లి సానుభూతి ఒలకబోసిన జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఉత్త చేతులతోనే కాలక్షేపం చేశారు. అధికారంలోకి రాకముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక ఇంకోలా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలపై జగన్ మాటతప్పి మడమ తిప్పేశారు!
అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం 3 వేల 957 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలి. కానీ ఇప్పటిదాకా చెల్లించింది కేవలం 905కోట్ల 57 లక్షలే అది కూడా రెండు విడతల్లో విదిల్చారు. 20 వేల రూపాయలలోపు డిపాజిట్ చేసిన వారికి తొలుత పరిహారం ఇస్తామన్నారు. ఐతే ఈ కేటగిరీలో మొత్తం పదమూడున్నర లక్షల మందికి 1150 కోట్ల రూపాయలివ్వాలి. కానీ రకరకాల కొర్రీలు పెట్టిన జగన్ 10 లక్షల మంది బాధితులకు 905 కోట్ల 57 లక్షలు మాత్రమే చెల్లించారు. అంటే ఈ కేటగిరీలో మరో 3 లక్షల 10 వేల మందికి 244 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు. ఇక 20 వేలరూపాయల కన్నా ఎక్కువ మొత్తాలు డిపాజిట్ చేసిన బాధితులు ఆరున్నర లక్షల మంది ఉన్నారు. వారికి చెల్లించాల్సిన 2వేల 800 కోట్ల రూపాయలపై జగన్ నోరు తెరిచిన పాపాన పోలేదు.
ఆశ నిరాశల మధ్య అగ్రిగోల్డ్ బాధితులు- హామీ విస్మరించిన జగన్
అగ్రిగోల్డ్ ఆస్తుల్ని వేలం వేసి, ప్రతి పైసా బాధితులకు అందేలా చేస్తామని విపక్షంలో ఉండగా జగన్ నమ్మబలికారు! నిజానికి తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఒడిశాలోని 90 శాతానికి పైగా అగ్రిగోల్డ్ స్థిర, చరాస్తులు టీడీపీ హయాంలోనే జప్తు చేశారు. 21 వేల 642ఎకరాల భూములు, లక్షా 7 వేల981 చదరపు గజాల స్థలాలు అప్పట్లోనే జప్తు చేయగా రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం వాటి విలువ 3 వేల869కోట్లు. మార్కెట్ ధర అంతకు అనేక రెట్లు అధికంగా ఉంటుంది. ఐదేళ్లూ అధికారంలో ఉన్న జగన్ వాటిని వేలం వేయలేదు. ఇక అగ్రిగోల్డ్ వినియోగదారుల సంక్షేమ సంఘం లెక్కల ప్రకారం ఇప్పటిదాకా 600 మందిబాధితులు చనిపోయారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10లక్షలు ఇస్తామని అప్పట్లో వేలంపాట పాడిన జగన్ ఒక్కపైసా ఇచ్చిందిలేదు! 99 శాతం హామీలు అమలు చేశానని సవాళ్లు విసిరేజగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వాల్సిన డబ్బులో కేవలం 22.87 శాతం మాత్రమే ఇచ్చారు. ఇదీ అబద్ధాల జగన్ మాటలు, చేతల్లో ఉన్న తేడా.
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చని సీఎం జగన్