Incessant Floods in Lanka villages of Konaseema District: గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ, వృద్ధ గౌతమీ నదీ పాయలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఉగ్ర గోదావరి భీకర వరదలతో లంకలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద కాస్త నెమ్మదించినా కోనసీమ జిల్లాల్లో వరద తీవ్రతతో జనం అవస్థలు పడుతున్నారు.
లంక గ్రామాల్లో వరద ఉద్ధృతి: ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టినా కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని లంక గ్రామాల్లో వరద ఉద్ధృతి తగ్గడంలేదు. ఇళ్లలోకి వరదనీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు వరదనీటిలో మునగడంతో పాఠశాలకు వెళ్లలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పశువులకు గ్రాసంలేక ఆకలితో అల్లాడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లంక గ్రామాల్లో మినహా మిగిలిన గ్రామాల్లో పాఠశాలలు తెరవడంతో తెరిచిన పాఠశాలల్లో చదివే లంక గ్రామాల విద్యార్థులను ముంపు నీటిలో ఇబ్బందులు పడుతూ పాఠశాలలకు తీసుకువెళ్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీగా పంట నష్టం: కోనసీమ జిల్లా గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ధవలేశ్వరం బ్యారేజీ నుంచి వరద నీటిని దిగువకు వదలడంతో కోనసీమ ప్రాంతాల్లో ఏమాత్రం వరద ఉద్ధృతి తగ్గడం లేదు. లంక గ్రామాల ప్రజలు మరపడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు పూర్తిగా మునిగిపోయాయని దీంతో భారీగా నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని లంక గ్రామాల రైతులు కోరుతున్నారు.
నీటిలోనే లంక గ్రామాలు : పడవలపైనే లంకవాసుల రాకపోకలుసాగిస్తున్నారు. కాజ్‌వేలు, ఉద్యానవన పంటలు మునిగిపోయాయి. నివాస గృహాలకు వరద చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగడంతో భారీ వరదను సముద్రంలోకి వదులుతున్నారు. ఆనకట్ట వద్ద 14.8 అడుగుల నీటిమట్టం ఉంది. సముద్రంలోకి 14 లక్షల 36 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.