Illegal Sand Mining in Krishna River At Papavinasanam : ఎన్నికల కోడ్ కూసినా అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక అక్రమాలకు మరింత జోరు పెంచారు. అధికారుల సహకారంతో పాపవినాశనం వద్ద కృష్టానదిలో అడ్డగోలుగా అక్రమ ఇసుక తవ్వకాలను చేపట్టారు. పాపవినాశం నుంచి ఇసుక లోడుతో వస్తున్నా టిప్పర్లను శుక్రవారం రాత్రి స్థానికులు అడ్డుకున్నారు.
అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు - భారీ వాహనాలతో దెబ్బతింటున్న రోడ్లు
Krishna District : కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలోని పాపవినాశనం సమీపంలో కృష్ణానదిలో నిత్యం వందలాది టిప్పర్లతో వైసీపీ నేతలు ఇసుకను తరలిస్తున్నారు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో బిల్లులను చూపిస్తూ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. నిత్యం వందల టిప్పర్లతో ఇసుకను రవాణా చేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పొక్లెయినర్లతో కృష్ణమ్మకు కడుపుకోతను మిగులుస్తున్నారు.
అధికార నేత అక్రమ ఇసుక తవ్వకాలకు విసుగు చెందిన గ్రామ ప్రజలు పాపవినాశనం కరకట్టపై టిప్పర్లను అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలకు సంబంధించిన బిల్లు చూపించాలంటూ పట్టుపట్టారు. గ్రామస్థులు ఎదురు తిరగడం వల్ల ఇసుక తవ్వకాలు చేస్తున్న 6 పొక్లెయిన్లు బయటకు తరలించారు. అనంతరం నదిలోకి గ్రామస్థులు వెళ్లకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దానితో పాటు కొద్దిమంది మనుఘలను పెట్టి బయటి వ్యక్తులు రాకుండా స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
పల్నాడు జిల్లాలో 'కుటుంబ అవినీతి కథా చిత్రం' - ఇసుకేస్తే రాలనంత అవినీతి!
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికి అధికారుల అండదండలతో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పశువులను నదిలోకి మేతకు తీసుకువెళుతున్నా అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ టీం అని క్వారీ లోకి వచ్చిన బయటి వ్యక్తులను, మీడియా వారిని ఫొటోలు తీస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. కృష్ణానదిలోకి కార్లు, ద్విచక్ర వాహనాలు ఎవ్వరు వెళ్లకుండా ఇసుక తవ్వకాలు చేసిన వారు కృష్ణానదిలోకి దిగే చోటున లోతుగా గండ్లు కొట్టడం విశేషం.
" కృష్ణానదిలో సుమారు 6 మీటర్లు లోతుగా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇసుక లోడుతో వెళ్లుతున్న టిప్పర్ల వల్ల కృష్ణానది కరకట్ట రోడ్డుపై పగుళ్లు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల నదికి సమీపంలోకి భూముల్లో బోరు వేసినా నీరు రాకపోవడంతో కొందరు రైతులు పంటలు సాగుచేయలేక భూములను వదిలివేశారు " -పాపవినాశనం గ్రామస్థులు
నిస్సిగ్గుగా వ్యవహరించిన పోలీసులు- ఇసుక మైనింగ్ అడ్డుకున్న గ్రామస్థులపై జులుం
ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఒకసారి కృష్టానదిలో జరిగిన అక్రమ ఇసుక గుంటలను పరిశీలించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు చేసిన వారిపై పెనాల్టీ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.