Hydra Demolishes Villas in Dundigal : హైదరాబాద్ మహా నగరంలో అక్రమ నిర్మాణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, ఇప్పటి వరకు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోని వ్యాపార కార్యకలాపాల జోలికి మాత్రమే వెళ్లింది. తుమ్మిడికుంట ఎన్ కన్వెన్షన్, అప్పా చెరువులోని పారిశ్రామిక షెడ్లను నిబంధనలకు విరుద్ధంగా అక్రమించారని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆక్రమణదారులంతా హైడ్రా అదే బాటలో వెళ్తుందని భావించిన క్రమంలో, అనూహ్యంగా తన వ్యూహాన్ని మార్చుకొని అక్రమ నివాస సముదాయాలపై దృష్టి సారించింది.
నిర్మాణాల పరిశీలన : దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను ఏ మాత్రం ఉపేక్షించకుండా ఒక్కొక్కటిగా నేలమట్టం చేసింది. వాటి యజమానులు మేల్కొనేలోపే ఇటాచీలతో విరుచుకుపడింది. యజమానులు అడ్డుపడ్డా, ఆపమని ప్రాధేయపడినా ఏ మాత్రం పట్టించుకోకుండా హైడ్రా తన కూల్చివేతలను కొనసాగించింది. కూల్చివేతలకు ముందే హైడ్రా ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించింది.
రెండున్నర ఎకరాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ను ఆక్రమించి 28 విల్లాలను నిర్మించినట్లు నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. వారం రోజుల కిందట హైడ్రా, నీటి పారుదల శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం అనధికారికంగా నిర్మించిన వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో పాటు ప్రభుత్వ శాఖల అధికారులతో హైడ్రా బృందం, భావన క్రిప్స్ విల్లాల వద్దకు చేరుకొని కూల్చివేతలు చేపట్టారు.
బాధితుల ఆందోళన : హైడ్రా కూల్చివేతలు ప్రారంభం కాగానే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి తమ ఇళ్లు వస్తాయేమోనని పలువురు యజమానులు ఆందోళనకు గురయ్యారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లో 28 విల్లాలు అక్రమమని గుర్తించగా, అందులో 8 విల్లాల్లో కొనుగోలుదారులు నివాసముంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక విల్లాలో నివాసముంటున్న కుటుంబాన్ని గంటలో ఇళ్లు ఖాళీ చేయాలని హైడ్రా అధికారులు ఆదేశించారు. దీంతో వారు వస్తువులను సైతం బయటపెట్టారు. భార్యా పిల్లలతో ఇప్పటికిప్పుడు ఇళ్లు ఎలా ఖాళీ చేయాలని బాధితుడు వాపోయారు. అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకుంటే, తమకు ఈ పరిస్థితి తలెత్తేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
142.24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కత్వా చెరువును ఆనుకొని సర్వే నెం.170/3, 170/4లో శ్రీలక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ భావన క్రిప్స్ పేరుతో 15 ఎకరాల్లో 325 విల్లాల నిర్మాణం చేపట్టింది. ఒక్కో విల్లా మార్కెట్ ధరకు అనుగుణంగా రూ.కోటి నుంచి రూ.కోటిన్నరకు పైగానే పలుకుతోంది. లేక్ వ్యూ ఉండటం, ఓఆర్ఆర్‌కు అతి సమీపంలోనే ఉండటంతో చాలా మంది ఇక్కడ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే ఆ విల్లాలు చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లో ఉన్నాయనే విషయాన్ని గమనించలేకపోయారు.
అక్రమ నిర్మాణాలు : శ్రీనివాస నిర్మాణ సంస్థ అక్రమాలు 2021లోనే వెలుగులోకి వచ్చాయి. 325 విల్లాల్లో 65 విల్లాలకు హెచ్ఎండీఏ అనుమతి ఉండగా మిగిలిన 260 విల్లాలకు గ్రామ పంచాయతీ నుంచి అక్రమంగా అనుమతులు పొందినట్లు తేలింది. 2021 డిసెంబర్ మొదటి వారంలో చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లో 7 విల్లాలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారుల సంయుక్త విచారణలో గుర్తించి నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు 2 విల్లాలను అధికారులు పాక్షికంగా కూల్చివేశారు.
ఈ క్రమంలోనే 204 విల్లాలను పురపాలిక అధికారులు సీజ్ చేశారు. అప్పటి పురపాలిక కమిషనర్ బోగీశ్వర్లు, ఇరిగేషన్ ఏఈ సారా ఫిర్యాదు మేరకు సదరు స్థిరాస్తి సంస్థ యజమాని విజయలక్ష్మిపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. నెల రోజుల క్రితం స్థానిక సర్వే నం.170లోని ప్రభుత్వ భూమిలో సదరు నిర్మాణ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఆర్ఐ ప్రదీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆమెపై మరో కేసు నమోదైంది.
Operation Hydra in Hyderabad : తాజాగా హైడ్రా కూడా బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులను ఆనుకొని నివాసం ఉన్న వారంతా తమ ఇళ్లపై కూడా హైడ్రా బుల్డోజర్లను పంపుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కొత్తగా నిర్మాణ దశలో ఉన్న నివాసాలు, నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు.