Home Safety Measures By Police : వరుస సెలువులు రావడంతో దసరా పండుగకు హైదరాబాద్‌లోని ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. జనం రద్దీ లేక నగరంలోని పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారనున్న నేపథ్యంలో పోలీసులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లతో పాటు శివారు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో కాలనీల్లో నిఘా పెంచి, వాహన తనిఖీలు విస్తృతం చేయాలని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే విచారించాలని సిబ్బందికి సూచించారు.
దసరాకు ఊళ్లకు వెళ్లే వారికి ఇవీ పోలీసుల సూచనలు : దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్లాల్సి వస్తే, విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనాలను ఇంటి ఆవరణలో నిలుపుకోవాలని పోలీసులు వెల్లడించారు. నమ్మకమైన భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలతో ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని తెలిపారు. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు. బయట ఉన్న ప్రధాన ద్వారానికి తాళం వేసి, అది కనిపించకుండా అడ్డుగా తెర ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.
ఆ వివరాలు సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దు : మరో ముఖ్య విషయం ఏంటంటే బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల, కొద్దిపాటి వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇంటికి వచ్చే, వెళ్లే దారులు ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకొని, డీవీఆర్ కనపడకుండా రహస్య ప్రదేశంలో ఉంచుకోవాలని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే తమను సంప్రదించాలని కోరుతూ నగరవాసులకు పలు జాగ్రత్తలు సూచించారు.
ఈ సూచనలు పాటిస్తే ఇల్లు భద్రం :
- పట్టణం నుంచి మీ స్వగ్రామానికి వెళ్లేటప్పుడు విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు ఇంట్లో ఉంచవద్దు. వెంట తీసుకెళ్లడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరచడమే ఉత్తమం. ఇంట్లో అయితే రహస్య ప్రదేశంలో దాచుకోవాలి.
- మీ ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ లేదా సెంట్రల్ లాక్ సిస్టమ్‌ను అమర్చుకోవాలి. ఇంట్లో లేనప్పుడు పాలప్యాకెట్లు, పత్రికలు తలుపు ముందు జమవ్వకుండా చూడాలి. ఇంటి బయట, లోపల కొన్ని లైట్లు ఆన్‌లో ఉంచుకోవాలి.
- వాహనాలను కచ్చితంగా ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి. ద్విచక్ర వాహనాల(బైక్, సైకిళ్లు) చక్రాలకు ప్రత్యేక లాక్ వేయాలి.
- బీరువా, లాకర్ తాళాలను రహస్య ప్రదేశంలో మాత్రమే దాచాలి. ఇంట్లోని సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్ ద్వారా గమనిస్తూ ఉండాలి.
- ఊరు, విహార యాత్రలకు వెళ్లే విషయం సామాజిక మాధ్యమాల్లో(ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్) పంచుకోవద్దు.
- కాలనీ సంఘాలు, అపార్టుమెంట్లలో ఉన్నవారైతే కచ్చితంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలి.
- కాలనీల్లో స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
- ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారమివ్వాలి.
- చోరీలకు ముందు దొంగలు కచ్చితంగా రెక్కీ నిర్వహిస్తుంటారు. పగటిపూట వేర్వేరు కారణాలతో వచ్చి కాలనీల్లో రెక్కీ చేసి రాత్రి దొంగిలిస్తుంటారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్‌చేసి వెంటనే సమాచారమివ్వాలి.
- కాలనీల్లో దొంగతనాలు అరికట్టేందుకు డయల్ 100 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్ నెంబరుకు సమాచారం ఇవ్వాలి.
సో చూశారుగా, హ్యాపీగా పండుగను ఎంజాయ్ చేసొద్దామని సొంతూర్లకు వెళ్తున్న వారు పైన వివరించిన జాగ్రత్తలను పాటించి, మీ ఇంటిని దొంగల బారి నుంచి కాపాడుకోండి.
విద్యార్థులకు గుడ్‌న్యూస్ - దసరా సెలవులు ఆ రోజు నుంచే! - DUSSEHRA HOLIDAYS IN AP
దసరా స్పెషల్ - ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే - APSRTC DUSSEHRA SPECIAL BUSES