High Tension in MLA Chevireddy Bhaskar Reddy Native Village : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామం తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు జేసీబీలతో భారీ సంఖ్యలో రెవెన్యూ అధికారులు, పోలీసులు మోహరించారు. అనంతరం ఆక్రమణలు తొలగించే పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేత పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి గ్రామస్థులకు మద్దతుగా వెళ్లారు. ఆందోళనకు దిగిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇంట్లోనే నిర్బంధించారు. పులివర్తి నానిని కూడా గృహ నిర్బంధం చేశారు.
Houses Demolition in Chandragiri : ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న మహిళకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మఠం భూముల స్వాధీనానికి చెవిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ స్థలాలు కొనుగోలు చేశామని, అధికారులు వచ్చి వాటిని తొలగించడం తగదని అన్నారు. ఎమ్మెల్యే బంధువులు భవన నిర్మాణాలు చేపడుతుంటే ఎవరూ అడ్డు చెప్పడం లేదని, పేదల షెడ్లను మాత్రం తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 ఎకరాలను చెవిరెడ్డి తన అధీనంలో ఉంచుకున్నారని ఆరోపించారు. మఠం అధికారులు వాటిని వెంటనే స్వాధీన పరచుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇప్పటంలో మళ్లీ మొదలైన కూల్చివేతల పర్వం.. భారీగా మోహరించిన పోలీసులు
పరిహారం చెల్లించాలని డిమాండ్ : తుమ్మలగుంటలో ఆక్రమణలు తొలగింపు పేరుతో పోలీసులు జేసీబీలతో పేదల ఇళ్లు కూల్చేశారని సుధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు మఠం భూముల్లో కేవలం పేదల ఇళ్లు మాత్రమే ఎందుకు కూల్చివేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆక్రమణలోని మఠం భూముల స్వాధీనానికి చెవిరెడ్డి యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని జనసేన నాయకుడు మనోహర్ డిమాండ్ చేశారు.
భూకబ్జా రెడ్డిగా మారిపోయారిన ఎమ్మెల్యే చెవిరెడ్డి : అధికార పార్టీ నేతలు ఐదు సంవత్సరాల పాటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్లో సంపాదించింది చాలక పేదలు భూమలు లాక్కుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి తుమ్మలగుంటలో హాథీరాంజీ మఠం స్థలంలోని పేదల ఇళ్లు కూల్చి వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ నేతల్ని గృహ నిర్బంధం చేసి అర్ధరాత్రి వెళ్లి జేసీబీలతో పేదల ఇళ్లు కూల్చుతారా అని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూకబ్జా రెడ్డిగా మారిపోయారని దుయ్యబట్టారు.
సీఎం సొంత జిల్లా.. బస్సులు తిరగని రోడ్డు.. విస్తరణ అంటూ ఇళ్ల కూల్చివేత
హాథీరాంజీ మఠం స్థలంలో 30 ఎకరాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆక్రమించారని ఆరోపించారు. 2.50 ఎకరాల్లో తన భార్య పేరుతో గెస్ట్ హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. పేదల స్థలాల లాక్కునేందుకే చెవిరెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కూల్చిన అధికారులకు ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే బందువుల ఇళ్లు కనపడలేదా, వారి ఇళ్లను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. కూల్చిన ఇళ్లు తిరిగి నిర్మించి ఆ స్ధలాలు పేదలకే ఇవ్వాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ నేతల పాపాలు- పార్టీలో చేరలేదని టీడీపీ మద్దతుదారుడి కోళ్లఫారం కూల్చివేత