High Court Rejects Bail For Vasudeva Reddy : జగన్ ప్రభుత్వ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్ అధికారి డి.వాసుదేవరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కీలక దస్త్రాలు, కంప్యూటర్ పరికరాల చోరీ, ఆధారాల ధ్వంసం ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో 'మధ్యంతర' ముందస్తు బెయిలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ దశలో బెయిలు ఇవ్వొద్దన్న సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.విజయ్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులిచ్చారు.
ఈ నెల 6న ఏపీఎస్‌బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలను చోరీ చేసి, కారులో తరలిస్తుండగా చూశానంటూ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మొగులూరుకు చెందిన గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వాసుదేవరెడ్డిపై మంగళగిరి సీఐడీ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నగేశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఘటన జరిగిన రోజు పిటిషనర్ దిల్లీలో ఉన్నారని చెప్పారు. అయినా రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారన్నారు. ఎలాంటి షరతులనైనా విధించి మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరారు.
సీఐడీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఎం.లక్ష్మీనారాయణ, పోసాని వెంకటేశ్వర్లు వాసుదేవరెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించొద్దని కోరారు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు. కారులో సోదాలు చేయగా 6 కిలోల బంగారం కొనుగోలుకు సంబంధించిన రశీదులు దొరికాయని, దాని విలువ సుమారు 4 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. కారులో వాసుదేవరెడ్డి ఐడీ కార్డు దొరికిందన్నారు. పిటిషనర్ కింద పని చేసిన అధికారులు ఇప్పటికీ కార్పొరేషన్‌లోనే పని చేస్తున్నారని వాసుదేవరెడ్డికి బెయిలిస్తే వారిని ప్రభావితం చేసే అవకాశం ఉందని నివేదించారు.
ఐపీసీ సెక్షన్లు 427, 379, 120(బి) కింద పిటిషనర్‌పై మొదట కేసు నమోదు చేశారని, వాటితో పాటు 420, 409, 467, 471 సెక్షన్లను చేర్చాలని కోరుతూ విజయవాడ మూడో అదనపు సీఎంఎం కోర్టులో మెమో వేశామని కోర్టుకు వివరించారు. ఏడేళ్లకు పైబడి జైలు శిక్ష పడేందుకు వీలున్న సెక్షన్లు అందులో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పిటిషనర్‌కు వర్తించవన్నారు. మరోవైపు విజయవాడలోని పిటిషనర్ ఇంటి తాళం బద్దలుకొట్టి సోదాలు చేసేందుకు దిగువ కోర్టు అనుమతి కోరామని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ దశలో మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వొద్దన్నారు. దీంతో కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.