AB Venkateswara Rao Suspension Issue : ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు నిలిపివేత పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏబీ వెంకటేశ్వరరావుని రెండో సారి సస్పెండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈ నెల 8న క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం చేశారు. దీనిపై ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతు హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. క్యాట్ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టును కోరారు. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, డీజీపీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం నేడు ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది.
క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టుకు సీఎస్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ, విచారణ జరిపిన క్యాట్ ఒకే అభియోగంపై రెండుసార్లు సస్పెండ్ చేయడం చెల్లదని తేల్చి చెప్పింది. సస్పెన్షన్ను ఎత్తివేస్తూ తక్షణం బాధ్యతలు అప్పగించాలని, వేతన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురిచేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు క్యాట్ తీర్పు మింగుడుపడకపోవడంతో తాజాగా హైకోర్టులో వ్యాజ్యం వేసింది.
సీఎస్ వేసిన వ్యాజ్యంలో ఆయన తరఫున సాధారణ పరిపాలనశాఖ డిప్యూటీ కార్యదర్శి జి జయరాం అఫిడవిట్ దాఖలు చేశారు. సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంలో క్యాట్ పొరపాటు పడిందని జయరాం అఫిడవిట్లో పేర్కొన్నారు. సస్పెన్షన్‌కు తగిన కారణాలు ఉన్నాయన్న విషయాన్ని క్యాట్ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులకు కట్టుబడి వ్యవహరించడంలో క్యాట్ విఫలమైందని అన్నారు. క్యాట్ ఉత్తర్వులు హేతుబద్ధంగా లేవన్నారు.