Heavy Loss to Farmers Due to Power Cuts: రాష్ట్రంలో వేసవి ఆరంభంలోనే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ప్రధానంగా వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌లో అధికారికంగా రోజుకు 2 గంటలపాటు జగన్ ప్రభుత్వం కోత పెట్టింది. గత మూడేళ్లుగా కోతలతో వైసీపీ సర్కారు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎన్నికల ఏడాది కావడంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రజలు భావించినా, విద్యుత్ సంస్థల తీరు అందుకు అనుగుణంగా లేదు. లోడ్ సర్దుబాటు, నిర్వహణ పనుల కోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల పరిధిలో సైతం అడపాదడపా కోతలు విధిస్తున్నారు. ఎండలు పెరిగేకొద్దీ కోతలు లేకుండా ప్రభుత్వం విద్యుత్ ఇస్తుందా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.
తెలంగాణలో వెలుగులు - ఏపీలో చీకట్లు - విద్యుత్ రంగంలో ఆంధ్రావని వెనకబాటు
ఫిబ్రవరి 14న గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ 12 వేల 470 మెగావాట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఉన్న డిమాండ్‌తో పోలిస్తే 720 మెగావాట్లు అదనం. దీనికి అనుగుణంగా సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు తంటాలు పడుతున్నాయి. గతేడాది అక్టోబరు 19న నమోదైన 13వేల39 మెగావాట్లు ఇప్పటి వరకు గ్రిడ్ గరిష్ఠ డిమాండ్‌గా ఉంది. ఈ ఏడాది మే, జూన్‌లో గత రికార్డులను తిరగరాస్తూ గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ 14 వేల మెగావాట్లు దాటే అవకాశం ఉందని అధికారుల అంచనా. ప్రస్తుతం రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో వారం కిందటి వరకు 11.38 ఎంయూలుగా ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం 0.69 ఎంయూలకు మించి రావడం లేదు. దీంతోపాటు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల కారణంగా గ్రిడ్ నియంత్రణకు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది.
గత వారం నుంచి విద్యుత్ వినియోగం రోజూ కనీసం 2 ఎంయూల చొప్పున పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం నాటికి వినియోగం 228.04 ఎంయూలకు చేరింది. ఇది ఫిబ్రవరి నెలాఖరుకు 250 ఎంయూలకు చేరే అవకాశం ఉందని అధికారుల అంచనా. అది క్రమేణా పెరుగుతూ మే, జూన్ నాటికి 270 ఎంయూలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. జెన్‌కో థర్మల్, జల విద్యుత్, అందుబాటులో ఉన్న ఇతర వనరుల ద్వారా 220 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి గ్రిడ్‌కు అందే అవకాశం ఉంది.
వేసవి రాక ముందే మొదలైన కరెంటు కష్టాలు - మరోవైపు గిర్రున తిరుగుతున్న స్మార్ట్ మీటర్లు
అంతకుమించి పెరిగే డిమాండ్ కోసం స్వల్పకాలిక ఒప్పందాలు, సెంబ్‌కార్ప్‌తో దీర్ఘకాలిక ఒప్పందాలను విద్యుత్ సంస్థలు కుదుర్చుకున్నాయి. దానికంటే ఎక్కువ అవసరమైతే బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా 104.08 ఎంయూలు, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో కుదిరిన ఒప్పందాలు, మార్కెట్ కొనుగోళ్ల ద్వారా 78.34 ఎంయూలు, పవన విద్యుత్ 29.33, సౌర విద్యుత్ 16.29 ఎంయూలు అందుబాటులో ఉంది.
వ్యవసాయానికి రోజూ పగటి వేళల్లో 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామన్నది వేదికలెక్కి జగన్ చెప్పే మాట. కానీ పగలు 4 గంటలు, రాత్రి 3 గంటలు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌లో రోజుకు అధికారికంగా 2 గంటలు కోతలు పెట్టారు. అనధికారికంగా మరో గంట విద్యుత్ సిబ్బంది కోతలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 గంటలు కోతలు అమలుకు సంబంధించి జిల్లా ఎస్‌ఈ కార్యాలయాల నుంచి కిందిస్థాయి సిబ్బందికి సంక్షిప్త సందేశాలు అందాయి. ఆ మేరకు ఫీడర్ స్థాయిలో సరఫరాను సిబ్బంది నియంత్రిస్తున్నారు.
స్వల్పకాలిక ఒప్పందాలతో అధిక ధరకు విద్యుత్ కొంటున్న ప్రభుత్వం-బాదుడే బాదుడు
దీంతో కీలక దశలో ఉన్న పంటలకు సరిపడా నీరు అందక వడలిపోతున్నాయి. లక్షల విలువైన పంట దిగుబడులను కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కోతల ప్రభావం రాయలసీమ జిల్లాలపై తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నవారికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సీమలో చీనీ, అరటి, మిరప సాగు ఎక్కువ. విద్యుత్ కోతల కారణంగా చీనీ తోటలకు సరిపడా నీరు అందక కాయలు రాలిపోతున్నాయి. మిర్చి, అరటి సాగు పంటల దిగుబడులపై కోతల ప్రభావం తీవ్రంగా ఉంటుందని రైతులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.