Power War in Telangana Assembly 2024 : తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా విద్యుత్ అంశం అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని విమర్శించారు. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎప్పుడో పక్కన పడేసిన పాత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారన్న రాజగోపాల్‌రెడ్డి, ఆ ప్రాజెక్టు నిత్యం ఏదో రీతిలో షట్‌డౌన్ అవుతుందని తెలిపారు.
జగన్, అతని అనుచరుల అహంకారమే వైఎస్సార్సీపీ పతనానికి నాంది : వైఎస్ షర్మిల - YS Sharmila on YS Jagan
కేసీఆర్ రాకపోవడం దురదృష్టకరం : థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇష్టారీతిన అంచనాలు పెంచి బీహెచ్ఈఎల్కు రూ, 20వేల కోట్లు విలువైన పనులు నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చారని ఆరోపించారు. విద్యుత్ రంగంపై న్యాయ విచారణ జరుగుతోందన్న ఆయన, బాధ్యులకు శిక్ష తప్పదని స్పష్టంచేశారు. కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడం దురదృష్టకరమన్నారు.
తప్పుదోవ పట్టిస్తున్నారు : అధికారపక్షం చేసిన ఆరోపణల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఖండించారు. విద్యుత్ మీటర్లపై ముఖ్యమంత్రి, సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని మండిపడ్డారు. పదేళ్లలో విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నారని, అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఓ బూచిలా చూపే యత్నం చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
"ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్యమంత్రి, సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం రంగ సంస్థలతో జరిగే ఒప్పందాలలో అవినీతి ఏముంటుందో తెలపాలి. పదేళ్లలో విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో చెప్పాలి". - జగదీశ్‌రెడ్డి, మాజీ విద్యుత్ శాఖ మంత్రి
కోరిక మేరకు విచారణ : జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సభ్యుల కోరిక మేరకే న్యాయ విచారణకి ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే కమిషన్‌కు వ్యతిరేకంగా మాజీ సీఎం కేసీఅర్, కోర్టుకు వెళ్లారని విమర్శించారు. అవినీతి బయటకు వస్తుందనే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
"బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగింది. బీఆర్ఎస్ సభ్యుల కోరిక మేరకు విచారణ కమిషన్‌ను నియమించాం. తమ అవినీతి భయటపడుతుందని కమిషన్‌ను రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు". - రేవంత్‌రెడ్డి, సీఎం
విద్యుత్ అక్రమాల విషయంలో ఇరుపక్షాలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలపై ప్రజలకు స్పష్టతనియ్యాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని వెంకట రమణారెడ్డి సూచించారు. విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల బాగానే ఉందన్న, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.