HC on CM Chandrababu Cases To CBI Petition: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూములు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్, మద్యం, ఉచిత ఇసుక విధానంపై అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, ప్రస్తుత మంత్రి పి నారాయణ సహా పలువురిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన కేసులను సీఐడీ నుంచి సీబీఐ, ఈడీకి అప్పగించేలా ఆదేశించాలంటూ స్వర్ణాంధ్ర తెలుగు డైలీ ఎడిటర్ బాలగంగాధర తిలక్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.
దానిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సదరు కేసుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబే నిందితుడిగా ఉన్నందున, దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీపాద ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఈ కేసులను దర్యాప్తు చేసిన ఐపీఎస్ అధికారులు సంజయ్, కొల్లి రఘురామిరెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే బదిలీ చేసిందన్నారు.
పేదల కోసమే ఉచిత ఇసుక విధానం - చంద్రబాబు లబ్ది పొందారనే దానిపై ఆధారాలేవి: హైకోర్టు
గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన కేసుల్ని సమీక్షిస్తామని సీఎం హోదాలో చంద్రబాబు, హోం మంత్రి అనిత మీడియాతో చెప్పారని వివరించారు. సంబంధించిన పత్రికా కథనాలను కోర్టుకు అందజేశారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్ని స్వయంగా ఆయనే సమీక్షిస్తాననడం సరికాదన్నారు. పిటిషనర్ వాదనల్ని ప్రభుత్వ న్యాయవాదులు తోసిపుచ్చారు. ప్రస్తుత ప్రజాహిత వ్యాజ్యానికి విచారణార్హత లేదని, ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు.
పిటిషనర్ విశ్వసనీయతనే సందేహం ఉందన్నారు. పత్రిక నడుతుపున్నానని చెప్తున్న పిటిషనర్ దాని సర్క్యులేషన్ సహా ఎలాంటి వివరాలూ పేర్కొనలేదన్నారు. స్వర్ణాంధ్ర అనే డైలీ లేదన్నారు. ప్రచార ఆర్భాటంతోనే వ్యాజ్యంలో 114 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారన్నారు. కేవలం పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వేసిన పిల్‌కు విచారణార్హత లేదన్నారు. వ్యాజ్యం విచారణార్హతపై కౌంటర్ వేసేందుకు సమయం కావాలన్నారు.
కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి సీఎం అయినంత మాత్రాన చట్టాలను అమలు చేసే యంత్రాంగమంతా విఫలమైందని భావించి దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ కోరడం సరికాదన్నారు. ఐతే ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా కేసుల ఉపసంహరించే విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటరేనని హైకోర్ట్ స్పష్టం చేసింది. కేసుల ఉపసంహరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తు చేసింది. వ్యాజ్యం విచారణార్హత సహా అభ్యంతరాలపై సమగ్ర కౌంటర్ వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, తదితరులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.
రింగ్‌రోడ్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ - చంద్రబాబు బెయిల్ రద్దుకు సుప్రీం 'నో'