Gunturu Police Arrest Rowdy Sheeter Borugadda Anil : వైఎస్సార్సీపీ పాలనలో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్ష నేతలు, మహిళలపై ఇష్టారీతిన అసభ్యపదజాలంతో రెచ్చిపోయిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. 2021లో ఓ వ్యక్తిని బెదిరించి 50 లక్షల డిమాండ్ చేశాడంటూ అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో అనిల్‌ను పోలీసులు అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 13 రోజుల రిమాండ్ విధించడంతో అతడ్ని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
రాజకీయ భవిష్యత్ ఉంటుందని కొందరు ప్రోత్సహించినందునే ప్రతిపక్ష నేతలపై దూషణలకు పాల్పడ్డానని రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ పాలనలో నోటికొచ్చినట్లు దూషించడం, అరాచకాలు, అక్రమాలకు పాల్పడిన అనిల్ ఎన్నికల ఫలితాల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2021లో కర్లపూడి బాబూ ప్రకాష్‌ను బెదిరించి 50 లక్షల డిమాండ్ చేసిన కేసులో పోలీసులు రెండురోజుల క్రితం అనిల్‌ను అరెస్టు చేశారు. అరండల్‌పేట డీఎస్పీ జయరాంప్రసాద్, పట్టాభిపురం సీఐ వీరేంద్రబాబు, అరండల్‌పేట సీఐ శ్రీనివాసరావు సుమారు రెండు గంటలపైగా అనిల్‌కుమార్‌ను విచారించినట్లు తెలిసింది.
బోరుగడ్డ అనిల్ అరెస్ట్ - వైఎస్సార్సీపీ హయాంలో రెచ్చిపోయిన నిందితుడు
మంచి భవిష్యత్ ఉంటుందంటే : వైఎస్సార్సీపీ హయాంలో ఎందుకు అక్రమాలకు పాల్పడ్డావు? నాటి ప్రతిపక్ష నాయకులను, మహిళలను ఎందుకు అసభ్య పదజాలంతో దూషించావు? ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడికెళ్లావు? ఎవరు ఆశ్రయం ఇచ్చారంటూ అతనిపై గుంటూరు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కొంతమంది వైఎస్సార్సీపీ నేతల ఒత్తిడి, ప్రోద్బలంతోనే అప్పట్లో అలా వ్యవహరించానని అనిల్ చెప్పినట్లు తెలుస్తోంది. కొందరి మాటలు నమ్మి దూకుడుగా ప్రవర్తించానని బదులిచ్చారు. ఇకపై అలాంటి తప్పు చేయనని వాపోయినట్లు తెలిసింది. అప్పట్లో ఎవరి ప్రోద్బలంతో మాట్లాడారో చెప్పాలని పోలీసులు పదేపదే ప్రశ్నించినా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఒకరు మంచి భవిష్యత్ ఉంటుందంటే రెచ్చిపోయానని ఇప్పుడేమో ఆయన పార్టీ మారడంతో తననెవరూ పట్టించుకోవడంలేదని బోరుగడ్డ అనిల్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఎట్టకేలకు చిక్కిన బోరుగడ్డ అనిల్ - ఈనెల 29 వరకు రిమాండ్
క్రిమినల్ కేసులు నమోదు : బోరుగడ్డ అనిల్ అరెస్టుకు సంబంధించిన వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వివరించారు. అతనిపై మెుత్తం 17 కేసులున్నాయని వెల్లడించారు. రిమాండ్ నిమిత్తం అనిల్‌ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పంపినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.
బోరుగడ్డ అనిల్ కార్యాలయానికి నిప్పు.. అది వారి పనే అంటున్న అనిల్..!