Grievance at TDP Office: వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని అనుచరుడైన అడబాల అప్పారావు కుమారులు తప్పుడు ధ్రువపత్రాలతో తన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన జి. సుబ్బారావు వాపోయారు. స్థలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి చెట్లు నరికి ఇటుకలు, 25 ట్రక్కుల మట్టి తవ్వుకెళ్లగా అడ్డుకోబోయిన తన భార్య, బిడ్డలపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావేదిక’లో వినతి అందజేశారు.
శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, టీడీపీ మైనారిటీ నేత మౌలానా ముస్తాక్ అహ్మద్ తదితరులు వినతులు స్వీకరించారు. పునర్నిర్మాణం కోసం పడగొట్టిన దేవాలయ శిథిలాల్లో దొరికిన నిధినిక్షేపాలను దేవాదాయ శాఖ అధికారులు కాజేశారని పల్నాడు జిల్లా బెల్లకొండ మండలం మన్నేసుల్తాన్‌పాలేనికి చెందిన అక్కల సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. గతంలో ఇన్‌ఛార్జి ఎమ్మార్వోగా పని చేసిన సునీత రూ.14 లక్షలు లంచం తీసుకొని, అటవీ భూములకు డి-పట్టాలు ఇచ్చారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని బెల్లంకొండ మండలానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు.