Govt Neglect Kondapally Fort in NTR District : అది శత్రుదుర్భేద్యమైన దుర్గం. ఎత్తైన భవనాలు రాతి బురుజులు రాజమహల్‌లు పెద్ద కొలనులు. ఇలా అడుగడుగునా రాజసం ఉట్టిపడేలా అలనాటి చారిత్రక కట్టడాలు, కళాఖండాలు కొండపల్లి ఖిల్లా పేరు చెప్పగానే ఇవే కళ్లముందు కదలాడుతాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కొండపల్లి కోట పాలకుల నిర్లక్ష్యంతో క్రమక్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోంది. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో పర్యాటకులు లేక నిర్మానుష్యంగా బోసిపోతోంది.
Ibrahimpatnam NTR District : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో కొండపల్లి ఖిల్లా ఉంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన పురాతన కట్టడాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ పర్యాటకులు తరలివచ్చేవారు. సందర్శకులతో కోటపై జాతరను తలపించేంది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత పురావస్తుశాఖ ఈ ఖిల్లాపై దృష్టి సారించి కనుమరుగైపోతున్న కోటకు జీవం పోసింది. కోట్ల రూపాయలు వెచ్చించి కొండపల్లి చారిత్రక విశేషాలను కళ్లకు కట్టేలా అద్భుతంగా పునరుద్ధరించింది. కోట అణువణువూ సందర్శించేలా రూట్ మ్యాప్‌లు కూడా సిద్ధం చేశారు.
'గండికోట' ఎండిపోయింది- 900 ఏళ్లలో ఇదే తొలిసారి అంటున్న గ్రామస్థులు
కొండపల్లి కోట అంటేనే మూడంతస్తుల రాతి బురుజు బాగా ప్రసిద్ధి. కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం ఉంది. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, నర్తనశాల, అంగడి, కారాగారం, ఆయుధాగారం, కొలనులు ఉన్నాయి. రాజమహల్ గోడలపై సుందరంగా తీర్చిదిద్దిన కళాఖండాలు ఇలా అనేక నిర్మాణాలు చారిత్రక ప్రాభవాన్ని కళ్లకు కడతాయి. విరూపాక్ష దేవాలయం ఇక్కడి మరో ప్రత్యేకత. అంతేకాదు ప్యాలెస్ సమీపంలో లోతైన జలాశయం కూడా ఉంది. కానీ పాలకుల నిర్లక్ష్యంతో కోట శిథిలావస్థకు చేరింది. ధాన్యాగారం గబ్బిలాలకు నివాసంగా మారింది. నాడు కాంతులీనిన కొండపల్లిలో ఇప్పుడు కనీసం విద్యుత్ దీపాలు కూడా లేవు.
కనువిందుగా కొండవీడు ఫెస్ట్ - ప్రత్యేక ఆకర్షణగా సాహస క్రీడలు, హెలీ రైడ్‌లు
రాజధాని ప్రాంతానికి తలమానికంగా కొండపల్లి కోట పర్యాటకులను ఆకర్షిస్తుందని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. దీనికి ప్రధాన కారణం రవాణా సౌకర్యం లేకపోవడమే. గతంలో తిరిగిన బస్సులు సైతం రద్దు చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి నేరుగా ప్రైవేటు వాహనాల్లో రావాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. జాతీయ రహదారి నుంచి కోటకు చేరుకోవాలంటే 6 కిలోమీటర్లు అటవీమార్గంలో ప్రయాణించాలి. అదీ ఇరుకు రహదారిపైనే రావాల్సి ఉంటుంది. సాయంత్రమైతే నిర్మానుష్యంగా మారడంతో సందర్శకులు ఇటువైపు వచ్చేందుకు ధైర్యం చేయడం లేదు. దీంతో వానరులు, శునకాలదే రాజ్యమైపోయింది.
కొండా రెడ్డి బురుజుపై లైటింగ్ షో- సీఎం జగన్ చిత్రాన్ని ప్రదర్శించిన అధికారులు
గతంలో కొండపల్లి కోటపై లేజర్ షో నిర్వహించేవారు. ప్రస్తుతం సందర్శకులు లేక లైటింగ్ షో నిలిపేశారు. జాతీయ రహదారి నుంచి కోటకు లింక్ రహదారిని మెరుగుపరచడం, రోప్‌వే నిర్మించడం, ఫుడ్ కోర్టులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే సందర్శకులు వచ్చేందుకు ఇష్టపడతారు. ఈ దిశగా ప్రభుత్వం, పురావస్తు శాఖ దృష్టి సారించి మళ్లీ కొండపల్లి కోటకు పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.