Students No Drinking Water Facility in Govt schools in Guntur District : వైఎస్సార్సీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, వైఫల్యాలు నేడు పాఠశాల విద్యార్థులకు శాపంగా మారాయి. నాడు - నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని పదే పదే ప్రచారం చేసుకున్న వైఎస్సార్సీపీ ఆచరణలో మాత్రం తీవ్ర ఆలసత్వం వహించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బడి పిల్లలకు కనీసం తాగేనీరు కూడా అందడం లేదు. చిన్నారులు సురక్షితం కాని చేతి పంపు నీటినే తాగాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
పని చేయడం లేదు : వానాకాలం వస్తే చాలు పిల్లలను రోగాలు చుట్టుముడతాయి. కలుషిత తాగునీరు, ఆహారం వల్లే ఎక్కువగా రోగాల బారిన పడతారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా డయేరియా కేసులు భయపెడుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడా ఆర్వో ప్లాంట్ల ద్వారా స్వచ్ఛమైన శుద్ధ జలం అందకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులను కలవర పెడుతోంది. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని గత వైఎస్సార్సీపీ సర్కారు చెప్పినవన్నీ కోతలేనని అర్థమవుతోంది. గుంటూరులో 30 కి పైగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుంటే ఐదారింటిలో తప్ప మిగిలిన పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు లేవు.
వైఎస్సార్సీపీ నేతల నిర్వాకం - బడిని కబ్జా చేసి బ్యాంకులో తాకట్టు పెట్టారు - Govt School Acquisition
ఖాళీగానే ఆర్వో ప్లాంట్లు : గుంటూరులో కావటి శంకరరావు నగరపాలక సంస్థ పాఠశాలలో నాడు - నేడు పనులు నత్తనడకన సాగడంతో ఎప్పుటి నుంచో ఆర్వో ప్లాంటు ఆరుబైటే ఉంది. ఇందులో చదువుకుంటున్న 500 మంది విద్యార్థులు బోరు నీటినే తాగుతున్నారు. సంగడిగుంటలోని నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో60 మంది విద్యార్థులున్నారు. ఇక్కడా ఆర్వో ప్లాంట్ 3 నెలలుగా ఖాళీగానే దర్శనమిస్తోంది. రోగాలకు భయపడి తల్లిదండ్రులు పిల్లలకు సీసాల్లో నీరు నింపి పంపుతున్నారు. భోజన సమయానికే పిల్లలు తెచ్చుకుంటున్న నీరు అయిపోతుండడంతో విద్యార్థులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. పక్కనే ఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులదీ ఇదే దుస్థితి. ఆర్వోప్లాంట్లు అమర్చాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేదని ఉపాధ్యాయలు వాపోతున్నారు.
మరమ్మతులతో మూలకు : పల్నాడు జిల్లాలో 80 శాతం పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. ఇటీవల నరసరావుపేట మండలం కేసనపల్లి మండల పరిషత్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు ఆర్వో ప్లాంటు పాడై విద్యార్థులు బోరు నీరు తాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్వో ప్లాంటుకు తక్షణమే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో కొన్నిచోట్ల దాతలు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయగా మరికొన్ని బడుల్లో సర్కారే ప్లాంట్లు పెట్టింది. కొన్ని నెలలకే అవన్నీ మరమ్మతులకు గురయ్యాయి. ఫిల్టర్ క్యాండిల్స్ అరిగినా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయలేదు. రిపేరు చేయాలని అధికారుల దృష్టికి ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లినా స్పందించలేదు. మరికొన్ని బడుల్లో మోటర్ల వైరింగ్ కాలిపోయి తాగునీరు అందడం లేదు.
"స్కూల్లో వాటర్ లేవు. ఇంటి వద్ద నుంచి తెచ్చుకోవాల్సిందే. అవి కూడా మధ్యాహ్నం భోజనం వరకే ఉంటున్నాయి. సాయంత్రం వరకు నీళ్లు లేకపోవడంతో పిల్లలకు ఇబ్బంది అవుతుంది. స్కూల్లో ఉన్న ట్యాంక్‌లో నిల్వ ఉన్న నీటిలో పురుగులు వస్తున్నాయి. దీంతో పిల్లలు అనారోగ్య బారిన పడుతున్నారు. స్కూల్లోనే మంచినీరు అందుబాటులో ఉంటే బాగుంటుంది"_ విద్యార్థుల తల్లిదండ్రులు
జిల్లా మొత్తం అదే తీరు : చిలకలూరిపేట, నరసరావుపేట పురపాలక పాఠశాలల్లో రెండేళ్లుగా ఆర్వోప్లాంటు పని చేయడం లేదు. వందలాది మంది పిల్లలకు కుళాయి నీరే దిక్కువుతోంది. నకరికల్లు పాఠశాలలో ఆర్వోప్లాంట్ అందుబాటులోకి రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గుండ్లపల్లి ప్రభుత్వ బడిలోనూ విద్యార్థులకు తాగునీరు అందని ద్రాక్షగానే మిగిలింది. బెల్లంకొండ మండలంలో మొత్తం 16 ఆర్వో ప్లాంట్లు (Arvo Plants) ఉండగా అందులో 10 పని చేయడం లేదు. గారపాడు ప్రభుత్వ బడిలో ఇంతవరకూ ఆర్వో ప్లాంట్ లేదు. విద్యార్థులు బోరు నీరు తాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన వైఎస్సార్సీపీ సర్కారు ఆచరణలో విఫలమైంది. కూటమి సర్కారు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.