AB Venkateswara Rao Suspension Case : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతు హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
క్యాట్ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, డీజీపీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం ఈనెల 23న ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది. తనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన క్యాట్ ఒకే అభియోగంపై రెండుసార్లు సస్పెండ్ చేయడం చెల్లదని తేల్చి చెప్పింది. సస్పెన్షన్ను ఎత్తివేస్తూ తక్షణం బాధ్యతలు అప్పగించాలని, వేతన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురిచేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు క్యాట్ తీర్పు మింగుడుపడకపోవడంతో తాజాగా హైకోర్టులో వ్యాజ్యం వేసింది.
సీఎస్ వేసిన వ్యాజ్యంలో ఆయన తరఫున సాధారణ పరిపాలనశాఖ డిప్యూటీ కార్యదర్శి జి జయరాం అఫిడవిట్ దాఖలు చేశారు. సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేయడంలో క్యాట్ పొరపాటుపడిందని జయరాం అఫిడవిట్లో పేర్కొన్నారు. సస్పెన్షన్‌కు తగిన కారణాలు ఉన్నాయన్న విషయాన్ని క్యాట్ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులకు కట్టుబడి వ్యవహరించడంలో క్యాట్ విఫలమైందని అన్నారు. క్యాట్ ఉత్తర్వులు హేతుబద్ధంగా లేవన్నారు.
పోస్టింగ్‌లోనే కాదు - ఓటు హక్కు కల్పించడంలోనూ కక్ష సాధింపే - AB Venkateswara Rao vote issue
క్యాట్ ఉత్తర్వులు జారీచేశాక వాటిని అమలు చేయాలని ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి వినతి ఇచ్చారన్నారు. వెంకటేశ్వరరావుపై 2021లో నమోదు చేసిన కేసులో ఇప్పటికే అభియోపత్రం దాఖలు చేశారని, ఈ కేసులో విచారణకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 2న అనుమతి ఇచ్చిందన్నారు. ఈ దశలో ఆయనను సర్వీసులో పునర్నియమిస్తే దిగువ కోర్టులో విచారణపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ నేపథ్యంలో తమ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతున్నానన్నారు.