GANJA AT VISAKHAPATNAM CENTRAL JAIL: విశాఖపట్నం సెంట్రల్ జైల్ వద్ద గంజాయి దొరకడం కలకలం రేపింది. జైల్లో పర్యవేక్షణ లోపించి ఖైదీలకు రాచమర్యాదలు అందుతున్నాయనే విమర్శలకు ఇలాంటి ఘటనలు మరింత బలం చేకూర్చుతున్నాయి. ములాఖత్ సమయంలో గుట్కా, ఖైనీ, బీడీలు అందిస్తున్నారనే ఆరోపణలుండగా, ఏకంగా ఖైదీలకు గంజాయిని చేరవేయడం చర్చనీయాంశంగా మారింది. జైలులో కొంతమంది సిబ్బంది సహకారంతో ఖైదీలకు కావాల్సిన మత్తు పదార్థాలు దర్జాగా అందుతున్నాయని సమాచారం.
ములాఖత్‌కు వచ్చి ప్యాకెట్ విసిరేసి: గతంలో సెంట్రల్ జైలులో గంజాయి దొరకడం సంచలనమైంది. 2023 ఆగస్టులో విశాఖ కేంద్ర కారాగారంలో ములాఖత్‌కు వెళ్లిన పాత నేరస్థుడు ఎల్లాజీ గోడపై నుంచి లోపలికి ఓ ప్యాకెట్ విసిరాడు. దీనిని గమనించిన సిబ్బంది జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, దానిని చూసి నివ్వెరపోయారు. అందులో గంజాయితో పాటు బీడీలు, ఖైనీ ప్యాకెట్లు, ఇరవై మత్తు టాబ్లెట్లు ఉన్నాయి. దీంతో ఎల్లాజీని అదుపులోకి తీసుకుని అరిలోవ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
ఏకంగా 15 ఎకరాల్లో గంజాయి సాగు - పోలీసులు ఏం చేశారంటే?
ఆ ఖైదీలే ఎక్కువ: విశాఖ సెంట్రల్ జైలులో 16 బ్యారెక్‌లుండగా, 1800 మంది వివిధ కేసుల్లో శిక్ష పడిన ఖైదీలను ఉంచుతారు. అయితే వీరిలో గంజాయి కేసుల్లో వచ్చిన వారే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ఇటీవల హోంమంత్రి అనిత జైలు తనిఖీ చేయగా, 1200 మంది వరకు గంజాయి కేసుల్లో వచ్చిన వారే ఉన్నట్లు తెలుసుకున్నారు.
లంచ్ బాక్సులో గంజాయి: సెంట్రల్ జైలులో ఫార్మాసిస్టుగా కడియం శ్రీనివాసరావు డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న గుర్రాల సాయి అనే వ్యక్తి చికిత్స కోసం జైలు ఆసుపత్రికి వెళ్లినప్పుడు శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడింది. ఇంటి నుంచి డ్యూటీకి వచ్చేటప్పుడు తన సోదరుడు గంజాయి ఇస్తాడని, అది తీసుకొచ్చి అందిస్తే డబ్బులిస్తానంటూ శ్రీనివాసరావుకు ఆశ చూపాడు. దీంతో ఫార్మాసిస్టు డ్యూటీకి వచ్చే సమయంలో తన లంచ్ బాక్సులో గంజాయి పెట్టుకుని తెచ్చి సాయికి ఇచ్చేవాడు. ఈ క్రమంలో 95 గ్రాముల గంజాయిని గోళీల రూపంలో చుట్టి లంచ్ బాక్సులో తీసుకుని సెంట్రల్ జైలుకి వస్తుండగా, పక్కా సమాచారంతో నిఘా అధికారులు మెయిన్ గేట్ వద్ద తనిఖీ చేసి పట్టుకున్నారు.
ఎస్కార్ట్ పోలీసులకు ఎర వేస్తూ: ఇటీవల ఓ రౌడీషీటర్ జైలు వద్ద గంజాయి మత్తులో హల్‌చల్ చేశాడు. ఆ సమయంలో తన దగ్గర డబ్బులు తీసుకుని గంజాయి ఇవ్వకుండా తనను మోసం చేశారంటూ హడావుడి చేసినట్లు సమాచారం. ఇటీవల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను మంగళగిరి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొచ్చిన ఎస్కార్ట్ పోలీసులు రాచమర్యాదలతో విందు ఇచ్చారు. తరువాత వారు సస్పెండ్ అయ్యారు. ఈ విధంగానే కోర్టుకు కొందరు ఖైదీలను హాజరుపర్చి, తీసుకొచ్చే సమయంలో ఎస్కార్ట్ పోలీసులకు ఎర వేస్తూ కావాల్సినవి జైలులోకి రప్పించుకుంటున్నారు.