Free Sand Policy has Started Across the State From Today : రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఉచిత ఇసుకపై విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత ప్రభుత్వ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాలను రద్దు చేసిన ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు ఎలాంటి రెవెన్యూ లేకుండా ఇసుక పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిల్వ కేంద్రాల్లో ఉన్న 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉచిత పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుపెట్టారు. కేవలం సీనరేజీ, రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేస్తున్నారు.
ఏపీలో ఉచిత ఇసుక విధానం వచ్చేసింది - జీవో జారీ చేసిన ప్రభుత్వం - Free Sand Policy Guidelines
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు : రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాలను ప్రభుత్వం ఖరారుచేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో తెచ్చిన 2019, 2021 ఇసుక విధానాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కొత్త విధానం రూపొందించే వరకు రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు ప్రభుత్వం సూచించింది. ఇసుక లోడింగ్, రవాణ ఛార్జీలను నిర్ధరించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఉచిత ఇసుకను భవన నిర్మాణాలు మినహా మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణ చేసినా, ఫిల్లింగ్ చేసినా జరిమానాలు నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకను మంత్రులు , ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.
నామమాత్రపు ధరకే ఇసుక లోడింగ్ : బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంలో రీచ్‌లో ఉచిత ఇసుక పంపిణీ ప్రాంభించారు. నామమాత్రపు ధరకు ఇసుక లోడింగ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లు, చిన్న సైజు లారీలను కనీసం ఇసుక రీచ్‌ల్లోకి కూడా రానిచ్చేవారు కాదని పెద్దపెద్ద లారీలతో ఇతర ప్రాంతాలకు తరలించేవారని స్థానికులు తెలిపారు. కానీ ఇప్పుడు ఉచిత ఇసుక ఇవ్వడంతో ట్రాక్టర్లు లోడింగ్ కోసం బారులు తీరాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ చేశారు.
కేవలం సీనరేజీ, రవాణా ఖర్చులు మాత్రమే వసూలు : ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చతుకుపాడు ఇసుక రీచ్‌లో ఉచిత ఇసుక విధానాన్ని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రారంభించారు. సీనరేజీ, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నామని ప్రభుత్వం అదనంగా ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని మంత్రి వెల్లడించారు. ఒంగోలులో ఉచిత ఇసుక పంపిణీని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ , ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో మూడు నిల్వ కేంద్రాల్లో దాదాపు 43 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని 15 రోజుల పంపిణీకి ఈ ఇసుక సరిపోనుంది. సీనరేజీ, రవాణా ఖర్చులు, జీఎస్టీ కలిపి టన్నుకు 247 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక 6వేల వరకు ఉండగా ప్రస్తుతం 1500 రూపాయల నుంచి రెండువేలకు దిగువకు చేరడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భవన నిర్మాణ కార్మికులకు పెరగనున్న ఉపాధి : రాయలసీమ జిల్లాల్లోనూ ఉచిత ఇసుకను పంపిణీ చేశారు. కమలాపురం మండలం చదిపిరాళ్లలో తెలుగుదేశం నేత పుత్తా నరసింహారెడ్డి ఇసుక పంపిణీ ప్రారంభించారు. ఉచిత ఇసుక పంపిణీతో ప్రజలపై భారం తగ్గతుందని భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురాంపల్లి నిల్వ కేంద్రంలో ఉచిత ఇసుక పంపిణీని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాంభించారు. ఉచిత ఇసుకతో ప్రజల కష్టాలు తీరనున్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఐదు రేవుల్లో ఉచిత ఇసుక తవ్వకానికి అనుమతులిచ్చినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు : ఉచిత ఇసుక విధానం ప్రారంభంకావడంతో భవన నిర్మాణ కార్మికులు, తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం కార్యాలయం నుంచి కవిత సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. విజయవాడలో భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉచిత ఇసుకతో ఇంటి నిర్మాణదారులకు దాదాపు లక్ష రూపాయలకు పైగా ఆదా కానుందన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం గడియార స్తంభం కూడలి వద్ద భవన నిర్మాణ కార్మికులు కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
తొలగిపోతున్న అడ్డంకులు - టిడ్కో ఇళ్లకు హడ్కో రుణం - Tidco Houses in AP
సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు యత్నం - ఇంటి చుట్టూ చక్కర్లు - Anjaneyulu Try to Meet CBN