Report on Free Bus for AP Women: మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు.. అక్కడ ఏయే బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు, ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ ఎలా అనే విషయాలపై అధ్యయనం చేశారు. ఏపీఎస్ ఆర్టీసీలో నిత్యం సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఇందులో 40 శాతం మంది అంటే 15 లక్షల వరకు మహిళలు ఉంటున్నారని నివేదికలో పేర్కొన్నారు. వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు, హైదరాబాద్ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. కర్ణాటకలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో, బెంగళూరులోని సిటీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించే విధానం అమలు చేస్తున్నారన్నారు. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు నగరాల్లోని సిటీ సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు గుర్తించామన్నారు.
"రైట్, రైట్" మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు కసరత్తు-అమలు ఎప్పట్నుంచంటే? - free bus for women
రాష్ట్రంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో పాటు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచిత సదుపాయం కల్పించేందుకు వీలుందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నారని, ఆ టికెట్‌పై ఛార్జీ సున్నా అనే ఉన్నా, టికెట్లిచ్చే యంత్రంలో మాత్రం అసలు ఛార్జీ నమోదవుతుందన్నారు.
ఇలా మహిళలకు జారీచేసిన సున్నా టికెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్కించి, రీయింబర్స్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారని తెలిపారు. తెలంగాణ, కర్ణాటకల్లో గతంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 65 నుంచి 70 శాతం ఉండగా, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాక 95 శాతానికి చేరిందన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీలో ఓఆర్ 69 నుంచి 70 శాతం మధ్య ఉందని.. ఉచిత ప్రయాణం అమలైతే అది 95 శాతానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని ఏపీలో అమలుచేస్తే, ఏపీఎస్‌ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. టికెట్ల రూపంలో వచ్చే రాబడి, స్టూడెంట్, సీజనల్ పాస్‌లు వంటి రూపంలో ప్రతి నెలా ఆర్టీసీకి రాబడి తగ్గుతుంది. ఆర్టీసీకి టికెట్ల ద్వారా నెలకు సగటున 500 కోట్లు వస్తుండగా, ఇందులో 220 కోట్ల వరకు డీజిల్‌కే ఖర్చు అవుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తున్నందున రాబడిలో నెలకు సగటున 125 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే.. ప్రభుత్వం ఆర్టీసీ నుంచి ప్రతి నెలా 25 శాతం సొమ్ము తీసుకోకుండా వదులుకోవాలి. మరో 125 కోట్ల వరకు ఆర్టీసీకే ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది.