Former MLA Kasu Mahesh Reddy on YSRCP Defeat: నిండు సభలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుని అవమానపరచినప్పుడే వైసీపీ పతనం మొదలైందని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై అమర్యాదగా మాట్లాడం ప్రజలు సహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన నాసిరకం మద్యం, ఇసుక పాలసీల వల్లే తమ పార్టీ ఓడిపోయిందని వివరించారు. పార్టీలోని పెద్దలకు ముందుగానే చెప్పినా వారు వినలేదని తెలిపారు. తమ పార్టీ ఓటమిపై నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విచారించగా కొన్ని విషయాలు తెలిశాయని మహేష్ రెడ్డి తెలిపారు.
ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ ఓటమికి నాసిరకం మద్యం విక్రయం ప్రధాన కారణమని తెలిపారు. మద్యం పాలసీమార్చాలని వైసీపీలోని పెద్దలు సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయిరెడ్డిలకు చెప్పినా ఫలితం లేకుండాపోయిందని తెలిపారు. అదే విధంగా ఇసుక పాలసీ వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. అంతే కాకుండా పార్టీలోని కొందరి నాయకుల నోటి దురుసు కూడా పార్టీ పతనానికి కారణమని వివరించారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన నేతలు చంద్రబాబుని దుర్భాషలాడారని అన్నారు. ఇలాంటి అవమానాలు చంద్రబాబు, టీడీపీ శ్రేణులలో కసి పెంచాయని అన్నారు. 2019లో జగన్ గెలిచినా, ఇప్పుడు చంద్రబాబు గెలిచినా అవమానాల నుంచి వచ్చిన కసే విజయానికి కారణమని తెలిపారు.
వెలుగులోకి వైఎస్ భారతి పీఏ అక్రమాలు - YS Bharti PA Land Grabbing
టీడీపీ నేతలు గెలిచాక దాడులు చేస్తున్నారని అంతే కాకుండా తమ పార్టీ కార్యాలయాలను కూల్చి వేస్తున్నారని అన్నారు. కార్యాలయాలను కూల్చడం చట్ట పరంగా జరిగినా ఇంత త్వరగా చేయాల్సిన అవసరం లేదని కాసు వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటామని మహేష్ రెడ్డి వివరించారు. గెలుపు ఓటములు చరిత్రలో సహజమేని వైసీపీ చేసిన తప్పులను టీడీపీ చేస్తే దాని పర్యవసానంగా తరువాత మరలా వైసీపీ అధికారంలోకి వస్తుందని వివరించారు. ఏది ఏమైనా విజయం సాధించే దిశగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సారధ్యంలో ముందుకు నడుస్తామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు.