foreign delegates attended Chandrababu swearing in ceremony: నవ్యాంధ్రలో నవశకం సారధ్య బాధ్యతలు తీసుకున్న చంద్రబాబుపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమల స్థాపనతో రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేస్తారని యువత గంపెడాశలు పెట్టుకుంది. దీంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయం నుంచి, ప్రజల కోసమే తాను శ్రమిస్తానని బాబు ప్రకటించడం కూడా ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.
ఈ క్రమంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అయితే, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దేశంలోని నేతలే కాకుండా, విదేశీ ప్రతినిధులు కూడా హాజరు కావడం ఆసక్తిగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన అనంతరం అమరావతికి పూర్వవైభవం రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆయా దేశాలు పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నాయనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్లుగా ఆయా దేశాలు వారి వారి ప్రతినిధులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పంపించాయి. వివిధ దేశాల తరఫున కాన్సల్ ప్రతినిధులు వచ్చారు. వీరిలో సింగపూర్, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ తదితర దేశాల ప్రతినిధులు ఉన్నారు.
- హాజరైన విదేశీ ప్రతినిధుల జాబితా
1 మిస్టర్ ఎడ్గార్ పాంగ్ (సింగపూర్ కాన్సల్ జనరల్, చెన్నై)
2 శ్రీమతి సిలై జకీ. (ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్)
3 మిస్టర్ చాంగ్ న్యున్ కిమ్. (రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సల్ జనరల్, చెన్నై)
4 శ్రీమతి టకహషి మునియో , (జపాన్ కాన్సల్ జనరల్, చెన్నై)
5 గారెత్ విన్ ఒవెన్ (బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్)
6 థియర్రీ బెర్త్‌లాట్ (ఫ్రాన్స్ కాన్సల్ జనరల్, బెంగళూరు)
7 మహ్మద్ అరిఫుర్ రెహమాన్ (బంగ్లాదేశ్ డిప్యూటీ కాన్సల్ జనరల్, చెన్నై)
8 మిస్టర్ ఈవౌట్ డి విట్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ నెదర్లాండ్స్
9 జెన్నిఫర్ అడ్రియానా లార్సన్ (యూఎస్ కాన్సల్ జనరల్, హైదరాబాద్)
10 సెంథిల్ తొండమాన్ ( గవర్నర్, ఈస్ట్రన్ ప్రావిన్స్, శ్రీలంక)
11 ఇవోట్ డెవిత్ (నెదర్లాండ్స్ కాన్సల్ జనరల్, ముంబయి)
ఆహ్వానం పంపిన ఏపీ ప్రభుత్వం: అమరావతి అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు పలు విదేశీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అందులో భాగంగా కొరియా కాన్సులేట్ జనరల్, జపాన్, సింగపూర్, దక్షిణకొరియా, నెదర్లాండ్స్ కాన్సులేట్ జనరల్స్‌కు ఆహ్వానం పంపించారు. ఆయా రాయబార కార్యాలయ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఆహ్వానం పంపింది. ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇప్పటికే ఆయా దేశాల ప్రతినిధులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరయ్యారు.