Food Poison Children Treatment in Visakha KGH: అనకపల్లి జిల్లా కైలాసపట్నంలో విషాహారం తిన్న విద్యార్థులకు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స కొనసాగుతోంది. కలుషితాహారం ఘటనలో 63 మందికి చికిత్స కొనసాగుతోంది. కేజీహెచ్‌లోని పిల్లల వార్డులో 39 మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరో ముగ్గురుకి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ఆస్పత్రిలో సుమారు 21 మంది చిన్నారులను స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారుల పరిస్థితి అందోళనకరంగా ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద చెప్పారు. చిన్నారుల ఆరోగ్యం మెరుగపడ్డాక డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. బాధిత చిన్నారులను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు జరగకుండా అనాధికార హాస్టల్స్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.
చిన్నారులకు ప్రాణాపాయం లేదన్న వైద్యులు: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన చిన్నారుల్లో మరికొందరు, నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. నర్సీపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 22 మంది చిన్నారులను స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీ, వైద్యాధికారులకు నివేదిక అందజేస్తున్నారు.
ప్రాణాపాయం లేకపోయినప్పటికీ పూర్తిస్థాయిలో పిల్లలు కోలుకునే వరకు వారికి వైద్య సేవలు అందించనున్నట్లు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శిరీష తెలిపారు. ఆస్పత్రిలో వైద్యసేవలు సంతృప్తిగా ఉన్నాయని చిన్నారుల తల్లీదండ్రులు తెలిపారు. గిరిజన పాఠశాలల్లో చదివే తమ పిల్లలను కేవలం మెరుగైన వసతుల కోసమే ఆశ్రమంలో చేర్పించినట్లు చెప్పారు.
అనధికార శరణాలయాలపై అధికారుల తనిఖీలు: అనధికారికంగా నిర్వహించే చైల్డ్ హోమ్స్, శరణాలయాలపై ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఉక్కుపాదం మోపారు. అల్లూరి జిల్లా చింతపల్లిలో అనధికారికంగా నిర్వహిస్తున్న లెని చిల్డ్రన్ హోమ్‌ని అధికారులు సీజ్ చేశారు. అందులో ఉన్న 25 మంది విద్యార్థులకు ప్రత్యామ్నాయ ప్రవేశాలు ఏర్పాటు చేశారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పలు శరణాలయాలలో ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీలు చేశారు. రంపచోడవరం కస్తూర్బాలో అధికారులు తనిఖీలు చేశారు. కైలాసపట్నంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. పాడేరు ఆస్పత్రి పర్యవేక్షణలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
చిన్నారులను చిదిమేసిన కలుషితాహారం- వసతిగృహ నిర్వాహకుడు అరెస్ట్ - Food Poison Children Death Case