Google AI Skilling WorkShop in AP : ఏఐ ఈ పదం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో గేమ్ ఛేంజర్‌గా చెప్పొచ్చు. అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తుంది. భవిష్యత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. దీంతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరిచేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏఐ టెక్నాలజీని విస్తృత పరిచేందుకు గూగుల్ లాంటి అగ్ర సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మొదటిసారిగా గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో గూగుల్ ఏఐ స్కిల్లింగ్ ఏపీ పేరుతో పైలెట్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గూగుల్ సంస్థ ప్రతినిధులు వర్క్‌షాపులు నిర్వహించి విద్యార్థులకు సాంకేతిక రంగంలో నైపుణ్యం ఎలా సాధించాలో వివరించారు.
VVIT Google AI Skill program : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాఫ్ట్వేర్లు వినియోగించి ఏఐలో వస్తున్న మార్పులను విద్యార్థులకు తెలియజేశారు. కంప్యూటర్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంపై పట్టుసాధించేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. గూగుల్ లాంటి బడా సంస్థలు నేరుగా కాలేజీలోనే వర్క్‌షాపులు నిర్వహించడాన్ని వారంతా స్వాగతిస్తున్నారు. తమ భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.
"ఏఐ స్కిల్‌ని మా కాలేజీలో ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నారు. గూగూల్‌తో ఒప్పందం చేసుకోవడం వల్ల ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. మార్కెట్లో ఉన్న ఉద్యోగావకాశాలను ఏ విధంగా సంపాదించాలో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలకు ప్రాముఖ్యత ఉంది. మా భవిష్యత్‌కు ఈ వర్క్‌షాప్ ఎంతో ఉపయోగపడుతుంది." - విద్యార్థులు
కంపెనీలు కోరుకుంటున్న మార్పులు బడా కంపెనీల్లో ఉద్యోగం ఎలా సంపాదించాలో గూగుల్ ప్రాజెక్ట్ ద్వారా తెలుసుకుంటామని విద్యార్థులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో ఆర్టిఫిషియల్ టెక్నాలజీని అమలు చేసేందుకు గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకుందని వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. ఏఐ వస్తే కొన్ని ఉద్యోగాలు పలు సెక్టార్లలో కోల్పోయినా అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇతర రంగాల్లో వస్తాయని చెప్పారు. మరిన్ని ఇంజినీరింగ్ కళాశాల్లో ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహించే అవకాశం ఉంది.
ఏఐతో భయం వద్దు - సద్వినియోగం చేసుకుంటే మంచి ఉద్యోగాలు
ఈ ఆవిష్కరణలు చూస్తే "వావ్" అనాల్సిందే! - ఏఐ పరిజ్ఞానంతో వినూత్న యంత్రాలు - మీరూ చూసేయండి