Father and Daughter Died due to Electric Shock : 'నాన్నా' 'కాపాడు, రక్షించు' అంటూ వినిపించిన కుమార్తె ఆర్తనాదాలకు ఆ తండ్రి గుండె ఒక్కసారిగా తల్లడిల్లింది. మేడపైకి వెళ్లిన తన బిడ్డకు ఏమైందంటూ ఒక్క ఉదుటున పరుగు తీశారు. కిందపడి కొట్టుకుంటున్న కుమార్తెను పట్టుకున్నారు. అప్పటికే కరెంటు తీగ తగిలి విద్యుదాఘాతానికి గురైన విషయాన్ని గమనించని ఆయన సైతం ప్రమాదానికి గురయ్యారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుమార్తె, ఇంటికి పెద్దదిక్కు మరణంతో ఆ కుటుంబం గుండె తరుక్కుపోయింది. ఈ ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం డి.తాళ్లవలస గ్రామంలో చోటు చేసుకుంది.
నాన్నా.. హాస్టల్లో ఉండలేనంటూ తిరిగిరాని లోకాలకు - Student Died Electric Shock
వివరాల్లోకి వెళ్తే, డి.తాళ్లవలస గ్రామానికి చెందిన కట్ట సూర్యారావు (55) ధాన్యం వ్యాపారి. ఇతనికి భార్య శకుంతల, కుమార్తె సంధ్య (23), కుమారుడు మనోజ్ కలిగి ఉన్నారు. పేదరికం నుంచి ఎంతో కష్టపడి వచ్చిన ఇతను అనతి కాలంలో వ్యాపారంతో ఉన్నత స్థితికి చేరుకున్నారు. ఇద్దరు పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానాల్లో చూడాలని ఆశపడ్డారు. అనుకున్నట్లుగానే కుమార్తె సంధ్య మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఆమె విశాఖలో ఉద్యోగం చేస్తుండగా, వర్క్‌ఫ్రం హోంలో భాగంగా కొన్నాళ్లుగా ఇంటి వద్దనే ఉంటూ పనిచేస్తోంది. కుమారుడు మనోజ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి వర్షం పడడంతో మేడపై ఆరబెట్టిన వస్త్రాలు తెచ్చేందుకు సంధ్య పైకి వెళ్లింది. చున్నీ తీసే సమయంలో అనుకోకుండా పక్కనే ఉన్న విద్యుత్తు తీగ తగిలింది.
తండ్రిని కాపాడేందుకు కుమారుడి యత్నం, విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై గట్టిగా కేకలు వేసింది. ఆ అరుపులు విన్న తండ్రి సూర్యారావు హుటాహటినా మేడపైకి వెళ్లారు. అప్పటికే కింద పడి కొట్టుకుంటున్న కుమార్తెకు ఏమైందో తెలియక ఒక్కసారిగా ఆమెను పట్టుకోవడంతో అతనూ షాక్‌కు గురయ్యారు. అక్క, తండ్రి ఎంతసేపటికీ కిందకి రాకపోవడంతో కుమారుడు మనోజ్ మేడపైకి వెళ్లి చూసి గట్టిగా అరుస్తూ అందర్ని పిలిచాడు. వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపివేసి సపర్యలు చేసినా సంధ్య అప్పటికే అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సూర్యారావును విశాఖ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని స్థానిక ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. ఇంటికి సమీపంలోని తీగలు సరిచేయాలని ఎన్ని సార్లు విద్యుత్తు శాఖ అధికారులను కోరినా పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
హెచ్చరిక : వర్షాకాలంలో కరెంటుతో జాగ్రత్త - ఇంట్లో ఈ పనులు అస్సలు చేయొద్దంటున్న విద్యుత్ అధికారులు!