Farmers Problems Due To Power Cuts: రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మరోవైపు కరవు విలయతాండవం చేస్తోంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవక రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతులు ఖరీఫ్‌లో పంటలను తీవ్రంగా నష్టపోయారు. కనీసం బోరు బావుల కింద రబీ పంటతోనైనా గట్టెక్కుదామని ఆశించిన రైతులకు ఆ పరిస్థితీ కనిపించడం లేదు. విద్యుత్ కోతలు, లో ఓల్టేజీ సమస్యలతో పంటలు నిలువునా ఎండిపోతున్నాయి.
వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం ఎంత బాగా ఇచ్చిందో ఎండిపోతున్న పొలాలను చూస్తే అర్థమవుతుంది. తమను ఆదుకోవాలని రాష్ట్రంలో రైతులు నిత్యం ఏదో ఓ ప్రాంతంలో రోడ్డెక్కి ఆందోళనకు దిగడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మార్చి చివర్లోనే ఇలా ఉంటే వేసవి ఇంకా ముదిరితే ఇంకెలా ఉంటుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పడానికి ఎండుతున్న పొలాలే సాక్ష్యం. అసలే ఎన్నికలొచ్చాయి. ఓట్లు మనకే పడాలి అంటే ప్రజలను ప్రసన్నం చేసుకోవాలి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం కదా మన సీఎం అందుకే గృహ విద్యుత్ వినియోగదారులకు కోతలు పెడితే ఓట్లకు నష్టం కలుగుతుంది. ఇక పీక్ డిమాండ్ సమయంలో అధిక ధరకు విద్యుత్‌ను కొనాలన్నా మార్కెట్‌లో దొరికే పరిస్థితి లేదు.
దీంతో ప్రత్యామ్నాయంగా సేద్యానికిచ్చే విద్యుత్‌లో రోజుకు రెండు గంటలు కోతలు పెట్టారు. గత రెండేళ్లుగా వేసవిలో విద్యుత్ కోతలతో సాధారణ ప్రజలకు జగన్ ప్రభుత్వం చుక్కల్నే చూపిస్తోంది. ఈ ఏడాదీ కోతలు కొనసాగిస్తే ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే వ్యవసాయ విద్యుత్‌పై కన్నేసి కోతలకు దిగింది. పైగా ఎప్పుడు మిగులు విద్యుత్ ఉంటే అప్పుడు సేద్యానికి ఫీడర్ల వారీగా సర్దుబాటు చేసేలా పథక రచన చేసింది.
అసలే వర్షాభావ పరిస్థితులతో పంటలు కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతున్న రైతులకు దిక్కుతోచడంలేదు. బోర్లు పనిచేయక కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే అల్లాడుతున్నారు. కొన్నిచోట్ల పొలాల్లోకి పశువులను వదలిపెట్టక తప్పని పరిస్థితి. పంటల దిగుబడి తగ్గే ప్రమాదముందని వాపోతున్న రైతులను పట్టించుకునే పరిస్థితిలో జగన్ సర్కారు లేదు.
రాష్ట్రంలోని రైతులు ఖరీఫ్ సీజన్‌లో ఎక్కువగా వానలపై ఆధారపడి పంటలు వేస్తే రబీలో బోరు బావులు, నదీ జలాలను నమ్ముకుని సాగు చేస్తారు. కానీ, ఈ ఏడాది రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. సాధారణం కంటే జూన్‌లో 31.5%, ఆగస్టులో 55%, అక్టోబరులో 87.7%, నవంబరులో 37.9% తక్కువగా వానలు కురిశాయి. దీని ప్రభావం నీటి ప్రాజెక్టులపై పడింది. అలాగే భూగర్భ జలాలు తగ్గడానికి కారణమయ్యింది. ఏ ప్రాజెక్టుల్లోనూ నీరు లేదు.
చాలా జలాశయాల్లో నీరు డెడ్‌స్టోరేజ్‌కు వచ్చేసింది. 2023-24 సంవత్సరంలో ఖరీఫ్, రబీలకు కలిపి ప్రభుత్వం 103 మండలాల్లోనే కరవు ఉన్నట్లు ప్రకటించింది. అయితే, రెండు సీజన్లలో కలిపి 130.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవడం గమనార్హం. దీంతో చాలా చోట్ల సాగుకు నీరు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖరీఫ్‌ను వెంటాడిన పరిస్థితి రబీ సీజన్‌కు వచ్చేసరికి తీవ్రంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా బోరుబావుల కింద సాగువిస్తీర్ణం లక్షల ఎకరాల్లో ఉంది.
అనంతపురం, కడప లాంటి జిల్లాలో రబీ పంటగా వేరుశనగను ఎక్కువగా సాగుచేస్తున్నారు. దీంతోపాటు మిర్చి, టమోటా, బెండ, చిక్కుడు తదితర కూరగాయలను కూడా విస్తారంగా సాగుచేస్తున్నారు. దానిమ్మ, మామిడి, చీనీ తదితర పండ్ల తోటలు కూడా విస్తారంగా ఉన్నాయి. వీటన్నింటికీ ఇప్పడు నీటి సమస్య తలెత్తుతోంది. పగలు రావాల్సిన కరెంట్‌ను రాత్రిళ్లు ఇస్తున్నారు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
కౌలు రైతుల కష్టాలు - రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కొర్రీలు - Government Not support Farmers
వ్యవసాయానికి పగటి పూట కరెంటు అనేది రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కన్పించని పరిస్థితి. కనీసం తెల్లవారుజామున 5 గంటల నుంచి కరెంటు వదిలినా మాకు ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు. అలా కాకుండా అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఇవ్వడం సరికాదని అంటున్నారు. మరి, ఆ సమయంలో పొలాలకు వెళ్లడం ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఎండుతున్న పొలాలను చూసి చాలా చోట్ల రైతులు గగ్గోలు పెడుతున్నారు. వినూత్నంగా తమ నిరసన తెలుపుతున్నారు. నీరందక వరి పంటలు ఎండిపోయాయని పొలాల్లో ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న వరిచేలుకు నీరు ఇవ్వాలని అధికారుల్ని వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. ఇక తమకు పురుగుల మందే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే కాదు ఎన్నికల ప్రచారానికి వస్తున్న వైసీపీ నేతలకు కూడా రైతుల నుంచి నిరసన సెగలు తప్పడం లేదు.
నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన రమణమ్మ ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిని బుధవారం ప్రశ్నించారు. దువ్వూరులో ప్రచారం చేస్తుండగా ఎస్సీ కాలనీలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేకు ఎదురుగా వెళ్లి కనిగిరి జలాశయం వెనక ప్రాంతంలో వందలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోతున్నా పట్టించుకోరేమని రమణమ్మ అడ్డుకున్నారు.
గుంటూరు జిల్లాలోని తెనాలి, వేమూరు, రేపల్లె మండలాల్లో వేల ఎకరాల్లో సాగునీరు లేక వరిపంట ఎండిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలకు పొలాలు బీటలు వారుతున్నాయి. వరి పొట్టకొచ్చే దశలో కళ్లముందే నిలువునా ఎండిపోతుంటే రైతు విలవిల్లాడుతున్నారు. కొన్ని చోట్ల అప్పులు చేసి మరి ట్యాంకర్లు తెప్పించి పంట పొలాలకు నీళ్లు అందిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు.
అకాల వర్షాలతో అన్నదాతలు విలవిల- వేలాది ఎకరాల్లో పంట నష్టం - Unseasonal Rains Damage Crops
రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పరిస్థితి కూడా మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుంది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8వేల 310 మెగావాట్లు. గతవారం పీక్ డిమాండ్ సమయంలో ఓరోజు 5వేల 604 మెగావాట్ల విద్యుత్ గ్రిడ్‌కు అందితే, ఆఫ్ పీక్ సమయంలో 4వేల 849 మెగావాట్లు వచ్చింది. రోజులో సగటున 5వేల 261 మెగావాట్ల ఉత్పత్తి జరిగింది. వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీలైనంత మేరకు థర్మల్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
కానీ, అప్పు పుడితేనే బొగ్గు వస్తుంది. బొగ్గు వస్తేనే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇదీ ఏపీ జెన్‌కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్‌కో నుంచి అందుతోంది. ఆ సంస్థకు బొగ్గు కొనుగోలుకు అవసరమైన నిధుల్ని సర్దుబాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదు. దీంతో జెన్‌కో అప్పు కోసం చూడాల్సిన దుస్థితి నెలకొంది. ముందే రాష్ట్ర విద్యుత్ అవసరాలను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తోంది. అది దాచి అసలు రాష్ట్రంలో విద్యుత్ డిమాండే లేదని చెప్పడం హాస్యాస్పదమని నిపుణులు అంటున్నారు.
ఓవైపు కరెంట్, మరోవైపు కరవు రాష్ట్రంలో రైతులకు తీరని అన్యాయమే చేస్తున్నాయి. ఆదుకోవాల్సిన సర్కార్ మొద్దనిద్ర వీడటం లేదు. పూర్తిగా నష్టపోయే వరకు చూడాలన్నట్టు ఉంది సర్కార్ పరిస్థితి చూస్తే. ఇవేమి తమకు పట్టవన్నట్టు మళ్లీ ఎన్నికల వేళ ప్రజల్లోకి ఓట్ల అభ్యర్థన కోసం వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. దీంతో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. రైతుల ఆగ్రహం ఎన్నికల్లో తమ పుట్టి ముంచగలదనే భయం వైసీపీ నేతల్లో ఏర్పడింది.
గోదావరి డెల్టాలో సాగునీటి సంక్షోభం - సాగునీరందక ఎండిపోతున్న వరిపైరు - Water Crises in Godavari Delta