Farmer Problems Due to Handri Neeva Anantapur District : అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా మండలంలోని పాత కొత్తచెరువు, వైటీ చెరువులకు నీరు అందిస్తున్నారు. ఈ క్రమంలో నైసర్గికంగా ఉన్న వంకలు, బ్రాంచ్ కెనాల్ ద్వారా నీరు చెరువులకు చేరుతోంది. అయితే ఈ నీరే గుంతకల్లు మండలం చెన్నప్ప కొట్టాలలో వ్యవసాయ పొలం ఉన్న అబ్దుల్ సలాం అనే రైతు పాలిట శాపంగా మారింది. పొలం పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ నీరు మొత్తం అతని పొలంలో వచ్చి చేరుతూ ఉండడంతో పంట పెట్టుకునే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నాడు అబ్దుల్.
కృష్ణా జలాల తరలింపు - రైతులతో వైఎస్సార్సీపీ నాయకుల వాగ్వాదం
Handri Neeva Anantapur : అధికారులు సరైన కాలువల సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో అతడికున్న ఆరు ఎకరాలలో పంట వేసుకునే అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నాడు. ఏదైనా పంట వేసినా కాలువలోని నీరంతా పొలంలోకి వచ్చి చేరడంతో పంట మొత్తం కుళ్లి పోతోందని ఆవేదన చెందుతున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ పది సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తలహసీల్దారు స్థానిక నాయకులతో కలిసి తన గోడు విన్నవించుకున్నా ఏ అధికారి ఇప్పటివరకు అతనికి పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు అబ్దుల్.
హంద్రీనీవా నీటిని కుప్పం తరలిస్తున్నారు - మంత్రి పెద్దిరెడ్డిపై 'అనంత' రైతుల ఆగ్రహం
అధికారులు రావడం, చూడడం, వెళ్లడం తప్ప తనకు చేసిందేమీ లేదంటూ అబ్దుల్ సలాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే అధిక వర్షపాతం లేదా ప్రకృతి వైపరీత్యాలకు మాత్రమే తాము బాధ్యత వహించి పరిహారం ఇప్పించగలము కానీ ఇలా హంద్రీనీవా ద్వారా వచ్చే నీటితో నష్టపోతున్నందుకు మేము ఎటువంటి న్యాయం చేయలేమంటూ చేతులెత్తేశారని పేర్కొన్నాడు.
'హంద్రీనీవా అధికారులు ఇప్పుడు న్యాయం చేస్తాం, అప్పుడు న్యాయం చేస్తామంటూ బొంకుతున్నారు. సమస్యకు పరిష్కారం చూపుతామంటూ నీటిపై రాతలు రాస్తున్నారు. కానీ ఇప్పటివరకు పరిష్కారం చూపి నాకు న్యాయం చేసిన పాపాన పోలేదు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తే కలెక్టర్ ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకుంటాను. చావు తప్ప నాకు మరో మార్గం కనబడటం లేదు.' - అబ్దుల్ సలాం బాధిత రైతు
హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు
పంట పొలాలు వేసుకోలేక చివరకు గడ్డి వేసుకొని పశువులు పెంచుకుందామన్నా ఆ గడ్డి కూడా నీరు ఎక్కువగా రావడంతో కుళ్లిపోతోందని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. తన సొంత పొలాన్ని హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్‌కు, పక్కనే వెళ్తున్న రోడ్డుకు కూడా ఇచ్చానని ఇప్పటివరకు తనకు పరిహారంగా ఒక్క రూపాయి కూడా ఎవరూ చెల్లించలేదని తెలిపాడు. తనకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశాడు.