Farmer Arrested For Questioning about Village Problem : నంద్యాల జిల్లా డోన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. ఇటీవల గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మూడోసారి గెలవాలనుకున్న మంత్రికి ఎదురుగాలి సంకేతాలు కన్పిస్తున్నాయో లేక ఓటమి భయం వెంటాడుతుందో ఏమో కానీ, ఇటీవల విపక్ష నాయకులపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు. బుగ్గన రాజేంద్రనాథరెడ్డి బుధవారం నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఎన్ రంగాపురం గ్రామానికి వచ్చారు.
వైఎస్సార్సీపీ నేతల అరాచకాలపై ప్రశ్న : మంత్రి పర్యటన సమయంలో గ్రామంలోని ఆరో వార్డు సభ్యుడు సుంకన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల అరాచకాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. శ్మశానాన్ని కొందరు వైఎస్సార్సీపీ నాయకులు కబ్జా చేశారని, బడి స్థలాన్ని ఆక్రమించారని తెలిపారు. వాగు భూమిలో మట్టి తోలడంతో సమీపంలోని కోనేరు బావిలోకి నీరు రావడం లేదని పేర్కొన్నారు.
HOUSE ARREST: తెదేపా నాయకుల గృహనిర్భంధం..
సుమారు 30 గంటలు చిత్రహింసలకు గురి : నిజానిజాలు నిర్ధారించుకోవాల్సిన మంత్రి, ఆయన అనుచరులు వృద్ధుడన్న కనికరం లేకుండా సుంకన్నపై విరుచుకుపడ్డారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో బుధవారం ఉదయం 11 గంటలకు సుంకన్నను స్టేషన్‌కు తరలించిన పోలీసులు గురువారం సాయంత్రం విడిచిపెట్టారు. సుమారు 30 గంటల పాటు తమ సమక్షంలో ఉంచుకున్నప్పటికీ అన్నం, నీళ్లు కూడా ఇవ్వలేదని సుంకన్న కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రిని సమస్య గురించి అడగడం తప్పా? నాకు అడిగే హక్కు లేదా? సమస్యకు పరిష్కారం చూపిస్తారని చెప్పాను. అంతకుమించి వేరే ఉద్దేశమూ లేదు. నేను వార్డు సభ్యుడిని. నా వయసును చూసైనా గౌరవించకుండా చిత్రహింసలు పెడుతున్నారు అని రైతు వాపోయారు.
"సమస్య గురించి ప్రశ్నించటమే నా తప్పా. గురువారం ఉదయం 11 గంటలకు నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. నా వయస్సు చూసి కూడా గౌరవించకుండా వేధింపులకు గురి చేశారు. ఊరిలో ఉన్న సమస్యను మంత్రిని అడగటం తప్పా". -సుంకయ్య, బాధితుడు
సమస్యలను మంత్రులు, అధికార పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పుడు వాటిని పరిష్కరించాలే గానీ ఇలా వృద్ధుడి పట్ల కనికరం లేకుండా ప్రవర్తించడం సరికాదని పలువురంటున్నారు.