TDP Leader Julakanti Brahmananda Reddy Interview : ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు కాకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (YSRCP MLA Pinnelli Ramakrishna Reddy) పారిపోవటానికి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) వంటి ప్రభుత్వ పెద్దలతో పాటు కొందరు పోలీసు అధికారులు కూడా అన్నివిధాలా సహకరించారని మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. చట్టం, ప్రజాస్వామ్యంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గౌరవం లేదని విమర్శించారు. గంటలో మాచర్ల వస్తానని సవాల్ విసిరిన పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలని ఎద్దేవా చేశారు.
పాల్వాయి, కేపీగూడెం, మాచర్ల దాడులపై నామమాత్రపు సెక్షన్లతో కేసులేంటని జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రశ్నించారు. కేపీగూడెంలో టీడీపీ ఏజెంట్లుగా కూర్చున్న గిరిజనుల్ని కొట్టారని తెలిపారు. అధికార పార్టీ దాడుల్లో గాయపడిన టీడీపీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు చలో మాచర్ల (Chalo Macherla) కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవటం ఏంటని ఆయన తప్పుబట్టారు. అతి త్వరలోనే మాచర్ల వెళ్లి బాధితుల్ని కలిసి వారికి అండగా ఉంటానంటోన్న జూలకంటి బ్రహ్మారెడ్డితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.