Second Day Postal Ballot Voting in AP: ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన ఉద్యోగులకే, తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎక్కడుందో తెలియని అయోమయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. వరుసగా రెండో రోజూ చాలా జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. అసలే ఎండలు ఠారెత్తిస్తుంటే, తమ ఓటు ఇక్కడ కాదంటూ అక్కడ, అక్కడ కాదంటూ ఇక్కడ అని తిప్పుతున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. రిటర్నింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను కోల్పోయారు. అనేకచోట్ల వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయడంపై తెలుగుదేశం తీవ్రంగా తప్పు పట్టింది.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద రెండోరోజూ గందరగోళ పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడంతో,కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు ఎక్కడుందన్న అంశాన్ని అధికారులు స్పష్టంగా చెప్పకపోవటంతో, అనేకచోట్లకు తిరిగి విసిగి వేసారిన ఉద్యోగులు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావును నిలదీశారు. ఓటు హక్కు కల్పించకపోవటంపై ఓ మహిళా ఉద్యోగి కంటతడి పెట్టారు.
నందిగామలో వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ హల్ చల్ చేశారు. స్థానిక కాకాని వెంకటరత్నం కళాశాల ఆవరణలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి సిబ్బందితో మాట్లాడి, తమకు అనుకూలంగా ఓట్లు వేయాలని చెప్పారు. కృష్ణాజిల్లా పామర్రులో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు, ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. ఓటు ఇక్కడ కాదంటూ అక్కడ, అక్కడ కాదంటూ ఇక్కడ అని తిప్పడమేంటని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చోబెట్టినా స్పష్టత ఇవ్వలేదంటూ, ఓ మహిళ కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోనూ ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి పీఏ కిషోర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రం వద్ద తిరుగుతూ ఉద్యోగులను ప్రలోభపెట్టే యత్నం చేశారు. సమాచారం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులు, నిబంధనల ప్రకారం అక్కడ ఉండడానికి వీల్లేదని వైసీపీ ఎమ్మెల్యే పీఏ కిషోర్ ను వెళ్లిపోవాలని చెప్పారు. అయితే ఆయన పోలీసులతోనే వాగ్వాదానికి దిగాడు.
నెల్లూరులోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గందరగోళంగా మారింది. నగరంలోని దర్గామిట్టలో ఉన్న డీసీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగస్తులు ఓటు లేదనే సమాధానంతో అవాక్కయ్యారు. ఓటు వేసుకోవాలని సమాచారం ఇచ్చి తీరా వచ్చాక ఓటు లేదంటే ఎలా అని ప్రశ్నించారు. చాలా మంది నిరాశతో వెళ్లిపోయారు.
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ - ఆగని వైసీపీ నేతల ప్రలోభాలు - Postal Ballot Voting Andhra Pradesh
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్లడంపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. అధికారుల తీరుపై పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రం ఆవరణంలో ప్రచారం నిర్వహిస్తూ... ఉద్యోగుల నుంచి ఓట్ల అభ్యర్థిస్తుండగా టీడీపీ నేతలు మండిపడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అనంతపురంలోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేతలు, ఉద్యోగులను ప్రలోభ పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లాలోని కదిరి బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులు పూర్తయ్యాక సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు అందజేస్తామని అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు.
పోస్టల్ బ్యాలెట్‌కు మరో రెండు రోజులు గడువు- ఏ ఒక్కరూ ఓటింగ్‌కు దూరం కావొద్దు: మీనా - AP CEO Visit Postal Ballot Center