Employee Private Business in Kadapa Government Hospital : ప్రజల అనారోగ్యాన్ని అస్వస్థతను నయం చేసే కడప ప్రభుత్వ ఆసుపత్రి వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. సిబ్బందిలో చాలామంది రోగులను పట్టించుకోకుండా ఆసుపత్రిల్లోనే చిన్నపాటి దుకాణాలు తెరిచి వ్యాపారులుగా మారిపోయారు. పూసలు, గిల్టు నగలు, చీరలు ఆసుపత్రి బెడ్‌పై పెడితే అక్కడ ఉన్న సిబ్బంది పనులు వదిలేసి కాలక్షేపం చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇందుకు అధికారులే వారికి ప్రత్యేక గదులూ ఇచ్చారని చెబుతున్నారు. వీరి నిర్వాకం వల్ల రోగులు మాత్రం ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆసుపత్రిలో వ్యాపారం : ఆసుపత్రుల్లో విధులు అంటే ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఆపదలో వచ్చే వారిని అక్కున చేర్చుకోకపోయినా కనీసం వారికి వైద్యుడి గది, వార్డులకు అక్కడ ఉన్న సిబ్బంది దారి చూపించాలి. కానీ, కడప ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్నా వారు మాత్రం ఇవేం పట్టించుకోకుండా పని ప్రదేశంలోనే ఏకంగా దుకాణాలు తెరిచారు.
విజయనగరం జిల్లా మహారాజా ఆసుపత్రికి సుస్తీ - Maharaja Sarvajana Hospital
ఓపీ కోసం రోగులు ఎదురుచూపులు : ఆసుపత్రి ఐపీ విభాగంలోని ఓపీ రిజిస్ట్రేషన్ కేంద్రంలో పని చేసే ఓ ఉద్యోగి పూసలు, గిల్టు నగలు తెచ్చి అక్కడ విధులు నిర్వర్తిస్తున్నా సిబ్బందికి విక్రయిస్తున్నాడు. సదరు ఉద్యోగి ఓ బెడ్‌ను కిందేసి దానిపై నగలు, పూసలు వేయగానే మిగతా సిబ్బంది పనులు వదిలేసి చుట్టూ పోగై కాలక్షేపం చేస్తున్నారు. ఇదే సమయంలో ఓపీ చీటీలు ఎప్పుడిస్తారా అని బయట రోగులు గంటలు తరబడి ఎదురుచూస్తున్నారు. ఇక్కడ కొందరు నర్సులు అయితే ఏకంగా చీరల దుకాణం తెరిచి, సదరు ఉద్యోగులకు విక్రయిస్తున్నారు. ఇందుకు అధికారులే వారికి ప్రత్యేక గదులూ ఇచ్చారని పేర్కొంటున్నారు.
చర్యలు తీసుకుంటాం : ఆసుపత్రిల్లో విధుల్లో ఉన్న ఇతర సిబ్బందిని అక్కడికి పిలిచి చీరలు కావాలా అని అడుగుతున్నట్లు సహచరులు తెలిపారు. అత్యవసర సేవలు అందించాల్సిన సిబ్బంది ఇలా ఆసుపత్రిల్లో వ్యాపారాలు చేయడంపై రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి దృష్టికి రోగులు తీసుకెళ్లారు. అందుకు ఆమె పరిశీలించి, చర్యలు చేపడతామని సమాధానం ఇచ్చారు.