Employee Confusion Over Postal Ballot Voting Across the State: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల గల్లంతుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నా తమ ఓట్లు కనిపించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. మచిలీపట్నంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్ జిల్లా ఉద్యోగుల కోసం మచిలీపట్నంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే, చాలామంది ఓట్లు లేవని చెప్పడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శనకు వచ్చిన కలెక్టర్‌తో ఉద్యోగులు గోడు వెల్లబోసుకున్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నా ఓటు కనిపించడం లేదంటూ బాపట్ల పోలింగ్ కేంద్రం వద్ద ఓ మహిళా ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రిటర్నింగ్ అధికారిని ఆమె నిలదీశారు.
అనంతపురంలో వైసీపీ నాయకులు ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తూ హల్ చల్ చేశారు. కవర్లో డబ్బులు పెట్టి ఇస్తున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులను ఉద్యోగులు చీవాట్లు పెట్టారు. ఈ ప్రభుత్వంలో తాము ఎంత నష్టపోయామో మీకేం తెలుసంటూ డబ్బును నిరాకరించారు. వైసీపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరించడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కళ్యాణదుర్గంలో ఓ కానిస్టేబుల్ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించగా కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కుమారుడు యశ్వంత్ అడ్డుకున్నారు. దీంతో వైసీపీ మూకలు యశ్వంత్‌పై దాడికి యత్నించడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ముందుగానే ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ - అయోమయంలో ఉద్యోగులు - Postal Ballot Voting
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేతలు మోహరించడంపై ఆర్వోకు కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఉద్యోగులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆత్మకూరులో నాలుగు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడంపై ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం వద్ద ఓటర్ జాబితాలు ప్రదర్శించకపోవడంతో ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కర్నూలు జిల్లా ఆదోనిలో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించడంతో ఎన్నికల సిబ్బందిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఓటు వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులు ఎండలో ఉక్కపోతతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో నెంబర్ వన్- జగన్ పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం: మోదీ - PM MODI speech
పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం నేతలను కేంద్రంలోకి ఏజెంటుగా అనుమతిస్తున్నారంటూ వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు టీడీపీ నేతల వాహనం అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు పోలీసులపైనా రాళ్లదాడికి యత్నించారు.