EC Reaction on Stone Attack: మేమంతా సిద్ధం బస్సు యాత్ర లో సీఎం జగన్ పై రాయి దాడి ఘటన పై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఘటన తాలూకూ వివరాలు ఇవ్వాల్సిందిగా సీఈఓ ను ఆదేశించింది. ఏపీ లో వీఐపీ లకు భద్రత కల్పించే అంశం లో వరుస వైఫల్యాలు ఎందుకు తలెత్తుతున్నాయని అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటన పై విజయవాడ సీపీ నుంచి సమగ్ర నివేదిక పంపాలని ఆదేశాలు ఇచ్చింది.
దీపక్ మిశ్రా నుంచి ఈసీ నివేదిక: ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారం లో రాయి దాడి ఘటన పై కేంద్ర ఎన్నికల సంఘం అరా తీసింది. ఆంధ్రప్రదేశ్ లో నే వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలు జారుతున్న తీరు పై ఈసీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. చిలకలూరిపేట ప్రధాని సభ, నిన్న సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యాలేంటని ఈసి ప్రశ్నించింది. ముఖ్యమంత్రి గాయపడిన ఘటనపై పై విజయవాడ సీపీ నుంచి సమగ్ర నివేదిక తీసుకోవాలని సీఈఓ ను ఆదేశించింది. దీనిపై ఏపీ లోనే ఉన్న ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు దీపక్ మిశ్రా నుంచి కూడా ఈసీ నివేదిక కోరినట్టు తెలుస్తోంది. సీఎంపై దాడి జరగడంతో ఎక్కడ రాజకీయ హింసాత్మక ఘటనల జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల పోలీసు నోడల్ అధికారి కి సూచనలు ఇచ్చింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ పాలరాజు, పలనాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై ఈసి బదిలీ వేటు వేసింది. ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరక్కుండా చూడాలని ఈసి ఆదేశించినా ఏపీలో పోలీసుల తీరు మారక పోవడం పై ఈసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం జగన్ రోడ్ షోలో భద్రతా వైఫల్యాలపై బెజవాడ సీపీ సహా ఇంకొందరి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇది 'కోడికత్తి డ్రామా 2.0' - సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు - Attack on YS Jagan
నిఘా విభాగం కీలక సూచనలు: మరోవైపు రాయి దాడి ఘటన తో సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. జగన్ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జన ప్రవేశంపై నిషేధం అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. మరీ అవసరమైతేనే జగన్ బస్ పరిసరాల్లోకి నేతలు కార్యకర్తలకు అనుమతి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. క్రేన్లు, ఆర్చిల ద్వారా భారీ గజమాలలను తగ్గించాలని సూచన చేసినట్టు సమాచారం. సీఎం జగన్ కూ జనానికి మధ్య గతంలో మాదిరిగా బారికేడ్లు ఉండేలా చూసుకోవాలని సూచన చేసినట్టు సమాచారం. అనంతపురం జిల్లా గుత్తిలో సీఎం జగన్ కాన్యాయిపై చెప్పులు, ఇప్పుడు రాళ్లు విసరడంతో నిఘా విభాగం ఈ సూచనలు ఇచ్చినట్టు సమాచారం.
నివేదిక అందించామన్న సీపీ: సీఎం జగన్ రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై ఈసీకి నివేదిక అందించినట్లు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు. దాడి ఘటన దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. 20 మంది సిబ్బందితో 6 బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని సీపీ తెలిపారు. ఇప్పటికే రాత్రి ఘటనా స్థలం పరిసరాల్లో సీసీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. ఆ పరిసర ప్రాంతంలో సెల్‌ఫోన్ డేటా కూడా సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు పలు బృందాలుగా విడిపోయి, దాడి ఘటనకు కారకులైన వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.