Tagore Movie Scene Repeats in Private Hospital at Hyderabad : ఠాగూర్ సినిమా గుర్తుందా మీకు. ఆ చిత్రంలో ఓ సీన్‌లో హీరో చిరంజీవి ఓ వ్యక్తి మృతదేహాన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చావుబతుకుల్లో ఉన్న తన అన్నని కాపాడాలని డాక్టర్లను వేడుకుంటాడు. రోగిని పరిశీలించిన డాక్టర్లు చనిపోయాడని తెలుసుకొని, మృతదేహానికి ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లు నటిస్తుంటారు. హీరోను అమాయకుడిగా భావించి వెంటనే డబ్బు కట్టేస్తే క్లిష్టమైన ఒక ఆపరేషన్ చేసి పేషెంట్‌ని కాపాడతామని కలరింగ్ ఇస్తుంటారు.
చివరకి వైద్యులు తాము ఏంతో ట్రై చేశాం కానీ మీ అన్నయ్యని కాపాడలేకపోయామని చిరంజీవి వద్దకు వచ్చి దీనంగా ఫేస్ పెట్టుకుని చెబుతారు. అప్పుడు చిరంజీవి చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ చూపించి వీళ్ల గుట్టు రట్టు చేస్తాడు. అచ్చం ఇలాంటి సీనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రిపీట్ అయింది. కానీ ఇక్కడ ఆ యువకుడు చనిపోలేదు కానీ వైద్యుల నిర్లక్ష్యంతో బ్రెయిన్‌డెడ్ అయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని ఓ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందిన యువకుడు వైద్యుల నిర్లక్ష్యంతోనే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని కుటుంబసభ్యులు ధర్నా చేపట్టారు. స్థానిక పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం, పరిగి పరిధి సుల్తాన్‌పూర్‌కు చెందిన మల్లయ్య పెద్ద కుమారుడు డి.విజయ్‌కుమార్(23) డిగ్రీ చదువుతున్నాడు. అతనికి తలలో సమస్య ఉందని స్థానిక వైద్యుడు చెప్పడంతో ఏప్రిల్ 2న కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని న్యూరో ఆసుపత్రిలో విజయ్‌కుమార్‌ను చేర్పించారు.
వెంటిలేటర్‌పై విజయ్‌కుమార్ : ఆసుపత్రి యాజమాన్యం మొదట రూ.2.5లక్షల ప్యాకేజీ అని చెప్పి ఆపరేషన్ చేశారు. తర్వాత మరో రెండు శస్త్రచికిత్సలు చేశారు. కుటుంబసభ్యులు అడిగినప్పుడల్లా మెల్లగా కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. చాలారోజులు కావడంతో సందేహం వచ్చి మే 20న బంజారాహిల్స్‌లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్‌డెడ్ అయినట్లుగా వైద్యులు చెప్పడంతో బోరున విలపించారు. ఎలాగైనా కాపాడాలని, మీ ప్రయత్నం మీరు చేయండి అంటూ కుటుంబసభ్యులు వేడుకోవడంతో విజయ్‌కుమార్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు.
మంగళవారం నాడు విజయ్‌కుమార్ బంధువులు, గ్రామస్థులు కేపీహెచ్‌బీలోని న్యూరో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. ఎస్సై శ్రీనివాసులు చేరుకుని సముదాయించడంతో ఆందోళనను విరమించారు. ఈ విషయమై ఆసుపత్రి యజమానిని వివరణ కోరగా విజయ్‌కుమార్ వచ్చిన సమయంలో స్పృహ లేదని, సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. తలకు మూడుసార్లు శస్త్రచికిత్స చేశామని, మిగతా అవయవాలకు ఇన్‌ఫెక్షన్ సోకడంతోనే ఇన్ని రోజులు ఉంచుకున్నామని ఆయన తెలిపారు.
కొడుకును కాపాడేందుకు గేదెలు, ఇంటి స్థలం అమ్మేశా : మంచిగా ఉన్న తన కుమారుడు వైద్యుల నిర్లక్ష్యంతో వెంటిలేటర్‌పై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని విజయ్‌కుమార్ తండ్రి మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి ప్రాణం కోసం పాలిచ్చే 12 గేదెలు, ఇంటి స్థలం, అప్పు తీసుకొచ్చి రూ.25లక్షలు ఆసుపత్రికి చెల్లించానని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన బిడ్డను చూసేందుకు వీల్లేకపోవడంతో రోజువారి పరిస్థితి చెప్పేందుకు రోజుకు రూ.1500 తీసుకున్నారని వాపోయారు. వయసొచ్చిన కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ప్రాణం పోయినట్లు అనిపిస్తుందని మల్లయ్య రోదించారు.