Doctor Ramesh Babu Suspicious Death in America : ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేష్ బాబు అమెరికాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కార్ పార్కింగ్ షెడ్ వద్ద తుపాకీ పేలడంతో మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా దుండగులు హత్య చేశారా అనే విషయాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. డాక్టర్ రమేష్ బాబు మేనకూరు ప్రభుత్వ పాఠశాలలో విద్య పూర్తయిన అనంతరం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు.
మెడిసిన్ కోర్స్ పూర్తయిన తర్వాత రమేష్ బాబు అమెరికాలో స్థిరపడ్డారు. రమేశ్‌బాబు అమెరికాలో పలుచోట్ల ఆసుపత్రులు నిర్మించి ఉపాధి కల్పించారు. టస్క్ లూసా ప్రాంతంలో వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రమేశ్‌బాబు సేవలకు గుర్తింపుగా అక్కడి వీధికి ఆయన పేరు పెట్టారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే రాజకీయ ప్రముఖులకు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చేవారు. అయితే డాక్టర్ రమేష్ బాబు మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
స్వగ్రామానికి విశేష సేవలందించిన రమేష్‌బాబు : రమేశ్‌బాబు తండ్రి ఓ రైతు. ముగ్గురు తోబుట్టువుల్లో పెద్దవాడైన రమేశ్‌బాబు పదో తరగతి వరకూ మేనకూరులో చదువుకున్నారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. జమైకాలో ఎంఎస్ పూర్తైన తర్వాత అమెరికా చేరుకుని అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరికి నలుగురు సంతానం కాగా ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు అంతా అక్కడే స్థిరపడ్డారు. రమేశ్‌బాబు కరోనా సమయంలో గొప్ప సేవలందించి పురస్కారాలు అందుకున్నారు.
డాక్టర్ రమేష్‌బాబు చదువుకున్న ఉన్నత పాఠశాలకు గతంలో రూ.14 లక్షలు విరాళం ఇచ్చారు. స్వగ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి 20 లక్షల రూపాయలు సైతం అందించారు. ఈ నెల 15న నాయుడుపేటలో బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన అంతలోనే మృతి చెందారని తెలియడంతో కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. రమేష్‌బాబు తల్లి, తమ్ముడు తిరుపతిలో, సోదరి నాయుడుపేటలో ఉంటున్నారు. వీరంతా అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
మహిళను చంపి- రూ.60 వేలకు మేకలను అమ్మేశాడు - Man Killed Shepherdess for money