Dhanwantari International Foundation Investment Scam : రాష్ట్రంలో విభిన్న రూపాల్లో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. అధిక వడ్డీ ఆశ చూపి, సొమ్ము చేసుకున్న తర్వాత బోర్డు తిప్పేసిన సంస్థల మోసాలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో నగరంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు సోమవారం సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడు కమలాకర్ శర్మ ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరిట రూ. 514 కోట్లు సేకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
'ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో ఎప్పటి నుంచో పెట్టుబడులు పెడుతున్నా. కానీ ఇప్పుడు వడ్డీలు చెల్లించడం లేదు. దీనిపై నిర్వాహకులను ప్రశ్నిస్తే సరిగా రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు. ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో అధిక వడ్డీలు ఇస్తున్నారని ప్రచారం చేయడంతో చాలా మంది పెట్టుబడి పెట్టారు. ఆఫీసు చుట్టు తిరిగితే ఇవాళ, రేపు చెల్లిస్తామంటూ మోసం చేశారు' -బాధితులు
దాదాపు 4 వేల మందికిపైగా బాధితులు : ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో దాదాపుగా 4 వేల మంది రూ. లక్షల పెట్టుబడులు పెట్టారని పోలీసులు గుర్తించారు. ప్రతీ మూడు నెలలకొకసారి అధిక వడ్డీలు చెల్లిస్తామని చెప్పి, పెట్టుబడులు సేకరించారని బాధితులు తెలిపారు. మరికొంత మందిని తమకు ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు కమలాకర్ శర్మను అరెస్ట్ చేసి, ధన్వంతరి ఫౌండేషన్ ఆస్తులను అటాచ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తప్పకుండా న్యాయం చేస్తామని సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి హామీ ఇచ్చారని బాధితులు వెల్లడించారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, తమ నగదు తమకు వచ్చేలా చేయాలని బాధితులు కోరుతున్నారు.
'ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగింది. దీంతో ఆ సంస్థపై ఫిర్యాదు చేశాం. బ్యాంకులో కన్నా ఈ సంస్థలో అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో పెట్టుబడులు పెట్టాం. హాస్పిటల్ నిర్మిస్తున్నామని ఏడాది పాటు ఆగాలని మాకు వడ్డీలు చెల్లించలేదు. ఇందులో దాదాపుగా 4 వేల మంది బాధితులు ఉన్నారు. ఈ విషయంలో సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి తప్పకుండా మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరిట ఎంతో మందిని మోసం చేశారు'- బాధితులు