Department of Mines Confirmed Gravel Mafia in Guntur District : గత ప్రభుత్వ హయాంలో కొండలు, గుట్టలు కరిగిపోయాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేయడమో లేక మట్టి తవ్వి తరలించడమో చేసేవారు. ముఖ్యంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో మట్టి మాఫియా మరింత రెచ్చిపోయింది. చేబ్రోలు మండలంలో నాణ్యమైన గ్రావెల్ లభిస్తుండడంతో నియోజకవర్గ నేత అండదండలతో వైఎస్సార్సీపీ నేతలు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచే మట్టి తరలించారు. గోరంత అనుమతులు తీసుకుని కొండంత తవ్వకాలు జరిపారు. పర్యావరణానికి తూట్లు పొడిచి సొంత జేబులు నింపుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించినా వైఎస్సార్సీపీ నేతలు లెక్క చేయలేదు.
Huge Gravel Magfia in Guntur : మట్టి మాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర గట్టిగా పోరాడారు. ఆయన స్వయంగా మట్టి క్వారీల్లోకి వెళ్లి మరీ నిద్రించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూగర్భ గనులశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన నివేదిక రూపొందించారు. 2020 నుంచి 2022 వరకూ జరిగిన అక్రమ తవ్వకాలను ఈ నివేదికలో పొందుపర్చారు. వీరనాయకునిపాలెం, శేకూరు గ్రామాల పరిధిలో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమంగా తవ్వి తరలించినట్లు అధికారుల బృందం గుర్తించింది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టింది. కేవలం రెండు గ్రామాల్లోనే ఈ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరిగితే మిగతా ప్రాంతాలను పరిశీలిస్తే దోపిడీ తీవ్రత ఏ స్థాయిలో జరిగిందో బయటకు వస్తుందని స్థానికులు అంటున్నారు.
అక్రమార్కులకు అప్పటి ప్రభుత్వ పెద్దలు కొమ్ముకాయడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు గనులశాఖ అధికారులు భయపడ్డారు. కేవలం నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టారు. 2019 నుంచి 2022 మధ్య అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలించే వారి కోటీ పది లక్షలు జరిమానా వసూలు చేయగా ఇవన్నీ ఓవర్‌లోడ్, టార్పాలిన్ కప్పకుండా రవాణా చేసినందుకు విధించిన జరిమానాలే తప్ప అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన విషయంపై మాత్రం చర్యలు తీసుకోలేకపోయారు.
ప్రైవేటు భూముల్లోనూ మట్టి తన్నుకుపోతున్న వైసీపీ గద్దలు- ప్రశ్నిస్తే బెదిరింపులు - Gravel mining
నలుగురు వ్యక్తుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా సాగినట్లు గనులశాఖ నివేదికలో తేల్చింది. మొత్తం 29 మంది నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలింపు చేపట్టారని గుర్తించింది. మొత్తం 3 లక్షల 55వేల 109 క్యూబిక్ మీటర్ల మట్టి తరలించారని శేకూరులో 30 నుంచి 35 అడుగుల లోతున తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. అక్రమ తవ్వకాలు జరిపిన వారికి ఇప్పుడు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవడానికి గనులశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. కొందరికి జరిమానా చెల్లించాలని డిమాండ్ నోటీసులు జారీచేశారు. అప్పట్లో ఆందోళన చేసిన వారిపైనే ఎదురు కేసులు పెట్టారని గ్రామస్థులు గుర్తు చేశారు.
మట్టిని ఆదాయ వనరుగా మార్చుకుని వైఎస్సార్సీపీ నేతలు ఐదేళ్ల పాటు చెలరేగిపోయారు. గనులు, రెవెన్యూశాఖలతో పాటు విజిలెన్స్ విభాగం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ చేస్తే ఏ మేరకు అక్రమాలు జరిగాయో తేలుతుంది.