Fake Offer Letter : ఉద్యోగ అవకాశాలున్నాయంటూ, వేతనం కూడా ఎక్కువే, వీలైన సమయాల్లోనే, ఎక్కడి నుంచైనా పని చేయొచ్చని వాట్సప్‌లో మెసేజ్ వచ్చిందా? అయితే అది రిక్రూట్‌మెంట్ కుంభకోణం కావొచ్చు అంటున్నారు సైబర్ నిపుణులు. పెద్ద ఉద్యోగం, ఆకర్షణీయ వేతనం, భారీగా జీతమిస్తామని ఊరించడంతో పాటు వీలైన సమయాల్లోనే, ఎక్కడి నుంచైనా పని చేయొచ్చని ఆహ్వానిస్తూ ఎవరైనా మెసేజ్ పెట్టారా? స్పందిస్తే మీరు చిక్కుల్లో పడ్డట్టే! ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మోసగాళ్ల వలలో పడడం ఖాయం. ఉద్యోగం మాట ఏమైగానీ, డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఎక్కువ. అయితే, ఇలాంటి మోసాల నుంచి తప్పించుకునేదెలాగో తెలుసుకుందాం.
జీ-మెయిల్ యూజర్లకు అలెర్ట్- మీకు ఆ రిక్వెస్ట్ వచ్చిందా?- అయితే బీ కేర్ ఫుల్..!
ఇప్పుడంతా సామాజిక మాధ్యమాల హవా కొనసాగుతోంది. వాట్సప్ రోజువారీ జీవితంలో భాగంగా మారగా.. ఈ మెయిల్స్, ఇన్‌స్టా, ఫేస్బుక్ వంటివి సమాచార మార్పిడికి దోహదపడుతున్నాయి. పుట్టినరోజులు, పండుగల శుభాకాంక్షలు, ఆన్‌లైన్ షాపింగ్, డెలివరీ సమాచారం అంతా వాటి ద్వారానే కొనసాగుతోంది. దీనికి తోడు స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులతో ముచ్చటించుకునేందుకు, ఎంటర్టైన్మెంట్ వేదికలుగా పేరొందాయి. ఇటీవల వ్యాపార విస్తరణకు కూడా సామాజిక మాధ్యమాలు ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి విస్తృత వేదికల్లో తెలిసినవారి నుంచి సందేశాలు, ఆహ్వానాలు అందటం మామూలే. కానీ అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వస్తే మాత్రం వాటిని సందేహించాల్సిందే. గోప్యత, భద్రతను ఎప్పటికప్పుడు మెరుగు పరుస్తున్నామని వాట్సాప్ యాజమాన్యం చెప్తున్నా ఇటీవల వాట్సప్‌లో రిక్రూట్‌మెంట్ మోసాలు బాగా పెరిగి పోయాయి.
ఇలా గుర్తించాలి..
వాట్సాప్ మెసేజ్‌లు పంపే వ్యక్తులు తామా ఫలానా సంస్థ పర్సనల్ మేనేజర్ అని చెప్పుకొంటారు. ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగులను నియమిస్తున్నామని, రోజుకు కొద్ది గంటలు పనిచేస్తే చాలు భారీగా జీతమిస్తామని ఆకర్షిస్తారు. ఇష్టముంటే ఈ నంబరుకు కాల్ చేయండి లేదా లింకును క్లిక్ చేయండి అని ఊరిస్తారు. అయితే, అప్పటికే ఉద్యోగ వేటలో ఉన్నవారు ఇలాంటి వాటికి త్వరగా ఆకర్షితుల వుతుంటారు. అయితే, విశ్వసనీయ కంపెనీలేవీ ముందుగా ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించకుండా నేరుగా సోషల్ మీడియాలో ఉద్యోగాలను ఆఫర్ చేయవు. మోసగాళ్లు అవి నిజమైన ఉద్యోగ ఆహ్వానాలేనని నమ్మించడానికి ప్రముఖ కంపెనీ ప్రొఫైల్ పిక్చర్‌నూ వాడుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సదరు కంపెనీ వెబ్‌సైట్‌లో ఫోన్ నంబర్, వివరాలను తనిఖీ చేయాలి. ఏదైనా అనుమానం వస్తే దూరంగా ఉండడం మంచిది.
ప్రతిస్పందించారో.. అంతే!
మరీ ఎక్కువ జీతంతో ఊరించే ఉద్యోగ ఆహ్వానాలకు స్పందించకపోవడం చాలా మంచిది. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు కోరినా, ఆఫర్ ముగుస్తుందంటూ త్వరగా దరఖాస్తు చేసుకోవాలని తొందర పెట్టినా అనుమానించాలి. ఇవి మోసాలకు స్పష్టమైన సంకేతాలని భావించి ఇలాంటి ఉద్యోగ ఆఫర్లకు ఆకర్షితులు కావొద్దు.
అంతర్జాతీయ ఉద్యోగాల ఎరతో..
విదేశాల్లో పనిచేయాలనే కోరిక ఉన్న వారికి వాట్సప్‌లో తరచూ అంతర్జాతీయ ఉద్యోగాల ఆహ్వానాలు అందుతున్నాయని తెలుస్తోంది. అంతర్జాతీయ ఫోన్ నంబరుతో మెసేజ్ వస్తే ఎవరికైనా ఉత్సాహమే. కానీ, 99% సందర్భాల్లో అవి మోసపూరితమైనవే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు అప్లికేషన్, రిజిస్ట్రేషన్ రుసుము పేరుతో డబ్బులు గుంజటానికి ప్రయత్నిస్తుంటారని చెప్తున్నారు. విశ్వసనీయ సంస్థలు తమ కంపెనీలో చేరాలని ఎవరినీ డబ్బులు అడగవని, ఒకవేళ ఉద్యోగులను వేరే చోటుకు మారిస్తే కంపెనీలే తగు ఏర్పాట్లు చేస్తాయి కాబట్టి అంతర్జాతీయ ఆఫర్లు వస్తే ఆ కాంటాక్టులను బ్లాక్ చేయటం ఉత్తమం అని సూచిస్తున్నారు.
ఊరించే మాటలకు మోసపోవద్దు
అధిక జీతం ఊసెత్తకుడా వీలైనప్పుడే పని చేయండి, ఎక్కడి నుంచైనా పని చేయండి అంటూ ఊరించే ఆహ్వానాలతోనూ మోసగాళ్లు బురిడీ కొట్టిస్తుంటారు. కొన్ని కంపెనీలు ఇలాంటి సదుపాయాలు కల్పించే మాట వాస్తవమే అయినా అవి వాట్సప్ ద్వారా సందేశాలు పంపించవవి తెలుసుకోవాలి. ఇలాంటి వాటిని మోసగాళ్లు మనల్ని నమ్మించటానికి వేసే ఎత్తులు అని అవగాహన ఉండాలి.
అంగటి సరుకులా వ్యక్తిగత వివరాలు
ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యక్తిగత వివరాల గోప్యతకు చోటులేదు. కొన్ని సంస్థలు వేల రూపాయలకే ఫోన్ నంబర్లు, ఈమెయిల్ చిరునామాలు విక్రయించడం చూస్తూనే ఉన్నాం. దురదృష్టం కొద్దీ చాలామంది ఈ వలలో పడి, డబ్బులు పోగొట్టుకోవడం రోజూ చూస్తూనే ఉన్నాం.
అంతర్జాతీయ ఉద్యోగాల ఎరతో...
ఆన్‌లైన్ మోసగాళ్లు రోజురోజుకీ ఎత్తుగడలు మారుస్తున్నారు. అధికారికమైనవని అనిపించేలా కంపెనీ లెటర్‌హెడ్‌తోనూ ఉద్యోగ ఆహ్వానాలు పంపిస్తున్నారు. అవి నిజమని నమ్మించడానికి మెసేజ్‌లు కూడా చేస్తుంటారు. అత్యవసరంగా ఉద్యోగం కావాల్సినవారు, అప్పటికే ఎన్నో ఉద్యోగాల కోసం కష్టపడిన వారు ఆ మోసాన్ని గుర్తించలేక వలలో పడిపోతుంటారు. నిజానికి విశ్వసనీయ కంపెనీలు ఎవరికి పడితే వారికి ఆఫర్ లెటర్లను పంపించవని గుర్తించాలి. అంతకుముందు ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఉద్యోగావకాశాలు ఇస్తున్నారంటే మోసమేనని అనుకోవాలి.
రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు - జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లే